గుంటూరు, ఆగస్టు 13,
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి రాజధాని కష్టాలు ముసురుకున్నాయి. వాస్తవానికి ఇక్కడ రాజధాని ఏర్పాటు అయినప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతించారు. అయితే, రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తున్నారంటూ.. కొన్నాళ్లు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. తర్వాత తర్వాత ఆయన సర్దుకున్నారు. నిజానికి రాజధాని గ్రామాల్లో చాలా వరకు ఈయన నియోజకవర్గంలోనూ ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మంగళగిరి ప్రాంతాన్ని రాజధానిగా చేశామని ఎంత డబ్బా కొట్టుకున్నా.. ఇక్కడ నుంచి స్వయంగా చంద్రబాబు తనయుడు లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఇక్కడ ప్రజలు వైఎస్సార్‌సీపీని గెలిపించారు. గత ఏడాది ఎన్నికల్ల ఆయా గ్రామాల్లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎక్కువగా ఓట్లు వచ్చాయి. అయితే, ఇప్పుడు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆళ్ల తీవ్రంగా మదనపడుతున్నారు.నిన్న మొన్నటి వరకు కూడా రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వాదించిన ఆయన అప్పట్లోనూ రాజధానిని వ్యతిరేకించలేదు. రైతుల పక్షాన తాను నిలబడతాననే చెప్పారు. ఇక, రాజధాని అమరావతిని తరలిస్తామనే ప్రకటన వచ్చినప్పుడు కూడా స్థానిక రైతులు ఆయన వద్దకు వచ్చినప్పుడు కూడా రైతులకు న్యాయం జరిగేలా జగన్‌తో మాట్లాడతానని చెప్పారు. కానీ, ఇప్పుడు జగన్ నిర్ణయం అమలు అయ్యింది. రాజధాని వికేంద్రీకరణ అంశం పూర్తయ్యింది. రేపో మాపో అత్యంత వేగంగా రాజధాని ఇక్కడ నుంచి తరలిపోనుంది. దీంతో ఈ ప్రభావం పార్టీపైనే కాకుండా వ్యక్తిగతంగా తనపైనా ఎక్కువగా ఉంటుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి భావిస్తున్నారు.మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంచి పలుకుబడి ఉంది. మన అనుకునే ఓటు బ్యాంకు కూడా ఉంది. వ్యాపార వర్గాల్లోనూ సానుభూతి ఉంది. అందుకే వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఇక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుతో పాటు టీడీపీపై ఒంటి కాలితో లేచేవారు. అయితే, ఇప్పుడు ఆళ్ల నియోజకవర్గంలో తీవ్రంగా రాజధాని సెగ ఎదుర్కొంటున్నారు. అధికార పక్షం లేదు ప్రతిపక్షం లేదు.. అన్ని వర్గాల ప్రజలకు పార్టీపై ఉన్న వ్యతిరేకత ఇప్పుడు ఆయనపై ప్రత్యక్షంగా పడుతోంది. ఆళ్లపై ఇక్కడి రైతులు, వ్యాపారులు పెట్టుకున్న ఆశలు కరిగిపోయాయి. దీంతో వారంతా కూడా పార్టీని వ్యతిరేకించడం తోపాటు.. ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కూడా వ్యతిరేకత పెంచుకున్నారు.ఇక ఆయనను వ్యక్తిగతంగా వ్యతిరేకించే గళాలు పెరుగుతున్నాయి. కేవలం ఆయన ఎమ్మెల్యేనేనని, ఆయనకు జగన్ దగ్గర మాట్లాడే ధైర్యం లేదని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఆయనకు పెద్ద ఎదురు దెబ్బలు అనుకుంటే మరోవైపు ఆయనకు జగన్ మంత్రి పదవి ఇస్తానని కూడా ఇవ్వలేదు. మరో రెండున్నరేళ్ల తర్వాత అయినా ఆయనకు మంత్రి పదవి వస్తుందన్న గ్యారెంటీ లేదని వైసీపీ వర్గాలే చర్చించు కుంటున్నాయి. ఇప్పటికే ఆయనకు సీఆర్డీయే చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి కి జగన్ అంతకు మంచి ప్రయార్టీ ఇవ్వడని అంటున్నారు. ఈ పరిణామలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. మరి వీటిని ఎదుర్కొని ఆయన ఎలా ముందుకు వెళతారో ? చూడాలి.