YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కుప్పంలో క్లీన్ స్వీప్ చేసేస్తున్నారు...

కుప్పంలో క్లీన్ స్వీప్ చేసేస్తున్నారు...

తిరుపతి, ఆగస్టు 13, 
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే అదే సమయంలో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే అనేక మంది టీడీపీ నేతలకు వైసీపీ కండువా కప్పేసింది. కరోనా ముగిసేలోపు కుప్పం టీడీపీని ఖాళీ చేస్తామంటున్నారు వైసీపీ నేతలు. మిగిలిన నియోజకవర్గాలు ఒక ఎత్తు. కుప్పం నియోజకవర్గం మరొక ఎత్తు. ఎందుకంటే అది చంద్రబాబు సొంతం.
కుప్పం నియోజకవర్గం గత దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటలా ఉంది. చంద్రబాబు ను గత ఏడుసార్లుగా కుప్పం నియోజకవర్గం ఆదరిస్తూ వస్తుంది. ఆయన కుప్పంలో ప్రచారానికి రాకపోయినా ఓటర్లు చంద్రబాబును తమ వాడిగానే గుర్తిస్తారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వచ్చి కొద్దిరోజులు ప్రచారం చేస్తారు. అంతే తప్ప చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో గెలుపునకు పెద్దగా శ్రమించరు.
అయితే గత ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గంలో మెజారిటీ బాగా తగ్గింది. లెక్కింపులో ఒక రౌండ్ లో వెనకబడి పోయారు కూడా. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆపరేషన్ కుప్పంను ప్రారంభించింది. ఇందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించడంతో పాటు టీడీపీ సానుభూతిపరులను పార్టీలో చేర్చుకుంటుంది. టీడీపీని బలహీనపర్చాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీతో గట్టి అనుబంధం ఉన్న నేతలకు వైసీపీ కండువా కప్పుతున్నారు. టీడీపీతో మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న కుప్పం మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ పార్టీలో చేరారు. జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ శ్యామరాజు కూడా వైసీపీలో చేరిపోయారు. వీరితో పాటు అనేకమంది పార్టీలో చేరిపోయారు. మరికొందరు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయిపోయారు.నిజానికి కుప్పం నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉంటారు. కురబ, వన్నెకుల క్షత్రియులు ఎక్కువగా ఉన్నారు. వీరిని ఆకట్టుకునేందుకు సంబందిత కుల నేతలను వైసీపీ రంగంలోకి దించింది. వరసగా నేతలు పార్టీని వీడుతుండటంతో కలవరపడిన చంద్రబాబు వరసగా నేతలతో టెలికాన్ఫరెన్స్ లను నిర్వహిస్తున్నారు. జిల్లా నేతలను కూడా ప్రత్యేకంగా కుప్పం కు పంపించి సెట్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే అనేక మంది నేతలు వెళ్లిపోవడం, బీసీ సామాజికవర్గంపై వైసీపీ కన్నేయడంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. మరి కరోనా వైరస్ తొలగిపోయే లోగా కుప్పం ను ఖాళీ చేస్తామని వైసీపీ నేతలు చేస్తున్న సవాల్ ను చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Related Posts