కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ ఆశాజనకమైన పనితీరును కనబరుస్తోంది. ఈ రోజు ఒక్కరోజే భారత్ ఖాతాలో ఆరు స్వర్ణాలు, ఒక రజతం వచ్చి చేరాయి. బాక్సింగ్‌లో మేరీకోమ్, గౌరవ్ సోలంకికి, షూటింగ్‌లో సంజీవ్ రాజ్ పుత్ బంగారు పతకాలు గెలుచుకోగా బాక్సింగ్‌లో భారత్ ఏకపక్షంగా ముందుకెళుతోంది. అమిత్ 46-49కేజీల విభాగంలో రజత పతకం దక్కించుకున్నాడు.దీంతో పతకాల పట్టికలో భారత్ టాప్3లో నిలవగలిగింది. మొత్తం 21 స్వర్ణాలు, 13 రజతాలు, 14 కాంస్య పతకాలతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తర్వాత మూడో స్థానంలో ఇండియా ఉంది. భారత్ గెలిచిన పతకాల సంఖ్య హాఫ్ సెంచరీకి(48) అతి చేరువలో ఉంది. మరో వైపు బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ ఫైనల్ చేరాడు.ఇక షూటింగ్‌లోనూ భారత్ జోరు కొనసాగింది. షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ తన ఖాతాలో గోల్డ్ మెడల్ వేసుకున్నాడు. పురుషుల 50మీ రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఈవెంట్‌లో సంజీవ్ కామెన్‌వెల్త్ గేమ్స్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.