YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇంచార్జీలతోనే కాలం గడిపేస్తున్నారు...

ఇంచార్జీలతోనే కాలం గడిపేస్తున్నారు...

గుంటూరు, ఆగస్టు 13. 
దాదాపు ఏడాది నుంచి ఆ నియోజకవర్గానికి ఇన్ ఛార్జి లేరు. అక్కడ ఎవరిని నియమించాలన్న దానిపై చంద్రబాబు ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదు. ఇన్ ఛార్జి పదవి కోసం పోటీ పడుతున్న వారిద్దరూ ఉద్దండులే కావడంతో ఎవరి పేరును ఇంకా ఖరారుచేయలేదు. దీంతో ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు నాయకత్వం లేక టీడీపీ క్యాడర్ డీలా పడిపోయింది.2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి కోడెల శివప్రసాద్ గెలిచి స్పీకర్ అయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. వైసీపీ కూడా అధికారంలోకి వచ్చింది. దీంతో కోడెల శివప్రసాద్ పై అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తుంది. అప్పటి నుంచి సత్తెనపల్లికి టీడీపీ ఇన్ ఛార్జిని చంద్రబాబు నియమించలేదు.
సత్తెనపల్లి ఇన్ ఛార్జిగా కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం కోరుతున్నారు. నిజానికి శివరాం నరసరావుపేట నియోజకవర్గ ఇన్ ఛార్జి కోరాలనుకున్నా అక్కడ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన అరవింద్ బాబు ఉండటంతో ఆలోచనను విరమించుకున్నారు. నిజానికి కోడెల కుటుంబానికి సత్తెనపల్లి కంటే నరసరావుపేటలోనే బలం ఎక్కువ. అందుకే కోడెల శివరాం నరసరావు పేట అడిగినా చంద్రబాబు సున్నితంగా తిరస్కరించడంతో సత్తెనపల్లి ఇన్ ఛార్జి పదవి అడిగారు.కోడెల మరణం తర్వాత సత్తెన పల్లి ఇన్ ఛార్జి తమకు కావాలని రాయపాటి కుటుంబం గట్టిగా పట్టుబడుతోంది. రాయపాటి సాంబశివరావు తన కుమారుడు రంగారావుకు గత ఎన్నికల సమయంలోనే సత్తెన పల్లి టిక్కెట్ ఇవ్వాలని గట్టిగా చంద్రబాబును కోరినా ఆయన తిరస్కరించారు. కోడెల మరణం తర్వాత రాయపాటి సత్తెనపల్లి ఇన్ ఛార్జి తన కుమారుడికే ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదు. స్థానిక నేత అబ్బూరి మల్లి ప్రస్తుతానికి పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. సత్తెనపల్లిలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ ఇన్ ఛార్జి లేకపోవడంతో క్యాడర్ కకావికలమవుతోంది.

Related Posts