YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

బోరుమంటున్న చేనేత రంగం

బోరుమంటున్న చేనేత రంగం

కరీంనగర్, ఆగస్టు 13, 
విడ్‌–19 మహమ్మారి వస్త్రోత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా 78 వేల మరమగ్గాలు ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పాలిస్టర్‌ బట్టను కొనేవారు లేక వస్త్ర పరిశ్రమ కుదేలైంది. ప్రభుత్వం ఇచ్చిన సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ), రంజాన్, బతుకమ్మ చీరల ఆర్డర్ల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి సంబంధించిన బిల్లులు అందక వస్త్రోత్పత్తిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్లకు మొత్తంగా రూ.150 కోట్ల మేరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది  రంజాన్‌ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు కానుకగా అందించేందుకు సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులకు 26.23 లక్షల మీటర్ల షర్టింగ్‌ బట్టకు ఆర్డర్లు ఇచ్చారు. 2020 జనవరి 3వ తేదీన ఆర్డర్లు ఇచ్చిన జౌళిశాఖ అధికారులు.. ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రంజాన్‌ బట్టను వస్త్రోత్పత్తిదారులు తయారు చేశారు. 10 లక్షల మీటర్ల బట్టను కొనుగోలు చేశారు. మరో 16.23 లక్షల మీటర్ల బట్ట కార్ఖానాల్లోనే ఉంది. ఈలోగా కరోనా లాక్‌డౌన్‌ రావడంతో సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌లో ఉత్పత్తి చేసిన రంజాన్‌ బట్ట నిల్వలు పేరుకుపోయాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నూలు, కొనుగోలు చేసి, కార్మికులకు కూలి చెల్లించి అమ్మకానికి సిద్ధంగా ఉన్న బట్టను జౌళిశాఖ కొనుగోలు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం రంజాన్‌ పండుగకు కొత్త బట్టలను పంపిణీ చేయలేదు. దీంతో సుమారు రూ.5.40 కోట్ల విలువైన నిల్వలు సిరిసిల్లలో ఉన్నాయి.  సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ)లో 1.30 కోట్ల మీటర్ల బట్టను ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్లు ఇచ్చారు. వస్త్రోత్పత్తిదారులు ఆ మేరకు బట్ట ఉత్పత్తి చేశారు. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు స్కూల్‌ యూనిఫామ్స్‌ అందించాలని ప్రభుత్వం భావించి ముందే ఆర్డర్లు ఇచ్చింది. దీంతో ఉత్సాహంగా ఎస్‌ఎస్‌ఏ బట్ట ఉత్పత్తి అయింది. రూ.50 కోట్ల విలువైన బట్ట ఉత్పత్తి చేశారు. ఆరు నెలల కిందట ఈ బట్టను కొనుగోలు చేసిన జౌళిశాఖ ఇటీవల రూ.30 కోట్ల మేరకు చెల్లించింది. ఇంకా రూ.20 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. సంక్షేమ శాఖలకు సంబంధించి బట్టల బిల్లులు సైతం రూ.3 కోట్ల మేరకు ఇలాగే పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఇప్పుడు బతుకమ్మ చీరల ఉత్పత్తి పెట్టుబడిగా వస్త్రోత్పత్తిదారులు అప్పులు చేయాల్సి వస్తుంది. సిరిసిల్లలో ఏడు కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల బట్టకు ఆర్డర్లు ఇవ్వగా దీని విలువ రూ.350 కోట్లు. 25 వేల మరమగ్గాలు, వెయ్యి ఆధునిక ర్యాపియర్‌ మగ్గాలపై 225 రంగుల్లో బతుకమ్మ చీరల ఉత్పత్తి సాగుతోంది. మంత్రి కేటీఆర్‌ వస్త్రోత్పత్తి ఆర్డర్ల బిల్లులు ఇప్పించాలని వస్త్రవ్యాపారులు కోరుతున్నారు.

Related Posts