విశాఖట్టణం, ఆగస్టు 13,
లెబనాన్ రాజధాని బీరుట్‌లో గతవారం జరిగిన విధ్వంసానికి భారీగా అమ్మోనియం నైట్రేట్ కారణమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి 25 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్‌తో ఓ నౌక విశాఖపట్నానికి చేరుకుంది. దీంతో నౌకాశ్రయ వర్గాలు అప్రమత్తమయ్యాయి. బీరుట్‌లో పేలుడు సంభవించిన సమయానికి విశాఖలో మొత్తం 18,500 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలున్నాయి. విశాఖలో నిల్వ చేస్తున్న వేలాది టన్నుల అమ్మోనియం నైట్రేట్ వల్ల సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు, రక్షణరంగ సంస్థలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలో బీరుట్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖ తీరానికి అమ్మోనియం నైట్రేట్ రవాణా జరుగుతున్న తీరుపై నౌకాశ్రయ ఛైర్మన్ కె.రామ్మోహనరావు సమీక్షించారు. దీనిని నిల్వచేసిన గొడౌన్‌లను అధికారులు పరిశీలించారు. ఈ నిల్వలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు తరలించాలని ఆదేశించారు. కానీ, తరలింపు ప్రక్రియ ఇంకా పూర్తికాక ముందే మరో నౌక విశాఖకు రావడం చర్చనీయాంశమైంది. విశాఖ నౌకాశ్రయానికి అమ్మోనియం నైట్రేట్‌తో మరో నౌక వచ్చిన విషయం వాస్తవమేనని నౌకాశ్రయ చైర్మన్ రామ్మోహనరావు ధ్రువీకరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య దీనిని గొడౌన్‌కు పంపుతామని తెలిపారు.మరోవైపు, అమ్మోనియం నైట్రేట్ నిల్వల కారణంగా ప్రమాదం జరగకుండా నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలూ లేనట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం గొడౌన్‌లను నిర్వహిస్తున్నారా? భద్రతా చర్యలు తీసుకుంటున్నారా? రవాణా సమయంలో నిర్ణీత నిబంధనలను పాటిస్తున్నారా? లేదా? అన్న అంశాలను మాత్రమే పర్యవేక్షించాల్సి ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. అమ్మోనియం నైట్రేట్ రవాణా పరిమాణంపై నియంత్రణ విధించే అవకాశం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది.