విజయవాడ, ఆగస్టు 13
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయమై ఇద్దరు నేతల మధ్య దూరం పెరిగింది. పిలిచి భోజనం పెడితే అంటూ.. జగన్‌పై కేసీఆర్ తీవ్ర వాఖ్యలు చేశారు. దీనికి బదులుగా జగన్ స్పందిస్తూ.. పోతిరెడ్డిపాడు పాతదే.. పాలమూరే కొత్తదంటూ కేసీఆర్‌కు సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో లేని అభ్యంతరం.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై ఎందుకంటూ జగన్ కేంద్రంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ అధికారులతో సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ భేటీ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కేసీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అధికారులు సీఎంకు చెప్పారు దీనికి జగన్ బదులిస్తూ.. కేసీఆర్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సహా ఇతర ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలకు త్వరలో జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే సమాధానం ఇద్దామని జగన్ చెప్పినట్లు సమాచారం.ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ కృష్ణా ట్రైబ్యునల్ కేటాయింపుల మేరకే చేపడుతున్నామని జగన్ చెప్పినట్లు సమాచారం. తెలంగాణతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నామన్న జగన్.. కానీ రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో మన వాదనను బలంగా వినిపిద్దామని అధికారులకు చెప్పారు.