ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మన దేశంలో స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ పరికరాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ విధించే వీలుంది. సర్క్యూట్ బోర్డులు, కెమెరా మాడ్యూల్స్, డిస్‌ప్లే తదితర విడి భాగాలపై కస్టమ్ సుంకం విధించడం వల్ల ఫోన్ల ధరలు పెరగనున్నాయి. విదేశాల నుంచి విడి భాగాలు దిగుమతి చేసుకొని మన దేశంలో అసెంబ్లింగ్ చేస్తున్న ఫోన్ల బ్రాండ్లపై ప్రభావం ఉండనుంది. దేశాన్ని ఉత్పత్తి హబ్‌గా మార్చడం కోసం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రభుత్వం విడి భాగాలను దిగుమతి చేసుకొని అసెంబ్లింగ్ చేస్తున్న వాటిపై కస్టమ్స్ సుంకం విధించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విడి పరికరాల దిగుమతి ఎలాంటి పన్ను వసూలు చేయడం లేదు. ప్రభుత్వం నిర్ణయం వల్ల ఆపిల్, సామ్‌సంగ్, ఎల్‌జీ, సోనీ లాంటి కంపెనీలు విక్రయించే ఖరీదైన స్మార్ట్ ఫోన్లపై ప్రభావం పడనుంది. మిడ్ రేంజ్, బడ్జెట్ స్మార్ట్ ఫోన్లపై కూడా స్వల్పంగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. దిగుమతి చేసుకుంటున్న మొబైల్ హ్యాండ్ సెట్లపై విధిస్తోన్న కస్టమ్స్ డ్యూటీని ఆర్థిక శాఖ ఇటీవలే 10 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీంతో ఆపిల్ సహా అనేక బ్రాండ్లకు చెందిన ఫోన్ల ధరలు పెరగనున్నాయి.