అకాల వర్షం, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, కేంద్రం వైపు చూడకుంబా సకాలంలో రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ డిమాండ్ చేశారు. ఆరుగాళం కష్టించి పనిచేసిన రైతు శ్రమంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తుందని, కేంద్రం బీమా కోసం నిధులు కేటాయించి ఇస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తాను ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోవడం వల్ల పంట నష్టం వాటిల్లినప్పుడు బాధిత రైతులకు ఆ బీమా అందడం లేదన్నారు. పైపెచ్చు బీమా పథకంలో రైతులను భాగస్వాములను చేయడానికి తగు చర్యలు తీసుకోవడం లేదని డాక్టర్ లక్ష్మన్ మండిపడ్డారు. ప్రధాని మోదీ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు అనేక చర్యలు చేపట్టారని, కానీ రాష్ట్రం వాటి అనుకూల చర్యలను చేపట్టడం లేదన్నారు. భూసార పరీక్షలు చేయడం లేదని, ఏ పంట ఎప్పుడు వేయాలో కూడా రైతులను సమాచారాన్ని ఇవ్వడం లేదని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా సరైన మోతాదులో లేరని, రైతులకు భరోసా కల్పించాల్సిన అధికారులు.. వారిని మోసం చేసేలా వ్యవహరించడం దారుణమని డాక్టర్ లక్ష్మన్ దుయ్యబట్టారు.అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వందల ఎకరాల పంట నష్టం వాటిల్లినా.. మంత్రులు, ఎమ్మెల్యేలు పంట పొలాలను సందర్శించలేదని, అహర్నిశలు కష్టపడి పంటపండించే రైతు బాధలు ఈ ప్రభుత్వానికి పట్టవా..? అని డాక్టర్ లక్ష్మన్ ప్రశ్నించారు. రైతు సమన్వయ సమితులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, రైతు సమన్యయ సమితిలో సభ్యులు ఎవరో తెలియదని రైతులు వాపోయారని, దీన్ని బట్టి ఈ ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు.రైతులెవరూ 24 గంటల కరెంటు అడగలేదని, దీనివల్ల కరెంటు మోటార్లు కాలిపోతున్నాయని, బోరుబావుల నీళ్లు ఇంకిపోతున్నాయని, ప్రభుత్వ అనాలోచిత చర్యలే దీనికి కారణమన్నారు. కేవలం ఓట్ల కోసం 24 గంటల కరెంటు అంటూ గిమ్మిక్కులు చేస్తున్నారని, పగటి పూట 9 గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. రైతులకు ఊరటనిచ్చే కార్యక్రమాలు చేపట్టకుండా.. అన్నదాతలను దగా చేస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు.రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లిందని, షామీర్‌పేట్ ప్రాంతం మేడ్చల్ లో వందల ఎకరాలు పంట దెబ్బతిందని, ప్రకృతి బీభత్సాల వల్ల పంటలు దెబ్బతింటే వాటిని పరిశీలించడానికి సుదూర ప్రాంతాల్లో అధికారులు కూడా రావడం లేదని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. పంట రుణాల విషయంలో రాష్ట్రం తన వాటా కట్టకపోవడం వల్ల చాలా మంది రైతులు నష్టపోయారని, వడ్డీలేని రుణాలు కూడా రైతులకు అందడం లేదని, నాలుగు వేల రూపాయల పంట పెట్టుబడి అన్నింటికీ పరిష్కారం కాదని, అది కేవలం ఎన్నికల కొరకు పెట్టుబడి పథకం అని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.రైతులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుని ఊరట కల్పించాల్సింది పోయి, పెట్టుబడి పథకం అన్నింటికీ సర్వరోగ నివారిణి అని ప్రచారం చేసుకుంటున్నారని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు.