తిరువళ్ళూర్‌లో జన్మించడం, కాశీలో మరణించడం, అరుణాచల స్మరణం ముక్తిని ప్రసాదిస్తాయి. మనకున్న పంచభూత శివ క్షేత్రాల్లో అగ్నితత్వానికి ప్రతీకయైన అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య వివాదం వచ్చినప్పుడు, ఆ వివాదం తీర్చడానికి, పరమశివుడు ఈ అరుణాచల క్షేత్రంలోనే మహాతేజోవంతమైన అగ్నిలింగంగా తన రూపాన్ని ప్రదర్శించాడని స్థలపురాణం.
అరుణాచలం పర్వతమే పరమశివుడు, పరమశివుడే అరుణాచల పర్వతం. అందుకే ఇక్కడ గిరిప్రదక్షిణం పేరున కొండ చుట్టు ప్రదక్షిణం చేస్తారు. అరుణాచలం పర్వత గుహలలోనే శ్రీ దక్షిణామూర్తి ఇప్పటికి ఉన్నారు. అరుణాచలం ఒక అద్భుతం. ఈ అరుణాచలంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. అరుణాచల పర్వతం మీద కార్తీక పూర్ణిమ రోజు వెలిగించే కార్తీక దీపం చూడడానికి దేశవిదేశాల నుంచి లక్షల మంది జనం తరిలివస్తారంటే తిశయోక్తి కాదు. ఈ రోజు అరుణాచలంలో వెలిగించే జ్యోతే పరమశివుడు. ఈ క్షేత్రంలో శివుడి పేరు అరుణాచలేశవరుడు, అమ్మవారి పేరు అపితకుచాంబిక.
తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మ, మేము ఈ అజ్ఞానమనే అంధకారం నుంచి జ్ఞానమనే వెలుగులోని వెళ్ళెదము గాకా అన్న ఉపనిషత్ వాక్యానికి ఈ జ్యోతియే నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ అరుణాచల కార్తీక దీపాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మన మనసుకు జ్ఞానం పొందేలా ప్రేరణ కలుగుతుంది.
చిదంబరంలో శివ దర్శనం అంత సులువు కాదు, తిరువళ్ళురులో జన్మించడం మన చేతిలో లేదు, కాశీలో చావడానికి వెళ్ళినా, అక్కడకు వెళ్ళినవారందరూ అక్కడే మరణించరు, ఈ అరుణాచలాన్ని స్మరించడం మాత్రం మన చేతిలోనే ఉంది. మీరు, నేను అనుకుంటే వచ్చేది కాదు ముక్తి, పైవాడి అనుగ్రహం ఉండాలి. అందుకోసం వాడి అనుగ్రహం పొందాలి. వాడి అనుగ్రహం కోసం నిత్యం అరుణాచలాన్ని స్మరించండి.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా...
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో