పోక్సో చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి మనేకా గాంధీ తెలిపారు. శనివారం లక్నోలోని రామ్ మనోహర్ లోహియా హాస్పటల్ ఉన్న రేప్ బాధితులను మంత్రి పరామర్శించారు. పీఓసీఎస్‌వో(ప్రొటెక్షన్ ఆఫ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్) యాక్ట్‌లో మార్పులు చేయాలని భావిస్తున్నామని, చిన్న పిల్లలపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణశిక్షను అమలు చేసే విధంగా చట్టాన్ని మార్చనున్నట్లు మంత్రి తెలిపారు. చిన్న పిల్లలు పట్ల క్రూరంగా ప్రవర్తించకుండా, భయంతో ప్రజలు ఎటువంటి తప్పుకు పాల్పడకుండా ఉండేందుకు చట్టంలో ఆ మార్పును తీసుకురానున్నట్లు మనేకా గాంధీ తెలిపారు.మరోవైపు ఉన్నావ్ రేప్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నది. కథువా అత్యాచార ఘటన పట్ల కూడా జమ్మూకశ్మీర్ సీఎం మొహబూబా ముఫ్తీ సీరియస్‌గా ఉన్నారు. రేప్ కేసు విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ఆమె ఆ రాష్ట్ర హైకోర్టును అభ్యర్థించారు. ఆ కోర్టు ద్వారా 90 రోజుల్లోనే సంచలన కథువా రేప్ కేసును పరిష్కరించాలని భావిస్తున్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను విధుల నుంచి తొలిగించినట్లు పీడీపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.