గుంటూరు, ఆగస్టు14,
రాయపాటి కుటుంబానికి నోటీసులు ఇచ్చిన పోలీసులు డాక్టర్ మమతను విచారణకు తీసుకెళ్లారు. రమేష్ ఆస్పత్రి ప్రమాద ఘటనలో రాయపాటి కుటుంబానికి కూడా నోటీసులు వచ్చాయి. రాయపాటి కుటుంబ సభ్యులను విచారణకు హాజరు కావాలని ప్రభుత్వం నోటీసులు పంపించింది.విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం, రమేష్ ఆస్పత్రి లింకుల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి లింకున్న ప్రతి ఒక్కరినీ దర్యాప్తులో భాగంగా పిలుస్తోంది. తాజాగా రమేష్ ఆస్పత్రి ప్రమాద ఘటనలో రాయపాటి కుటుంబానికి కూడా నోటీసులు వచ్చాయి. ఇటీవలే కరోనా బారినపడిన రాయపాటి రంగబాబు సతీమణి డా.మమతకు నోటీసులు పంపారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు రాయపాటి నివాసానికి చేరుకుని డాక్టర్ మమతను విచారణకు తీసుకెళ్లారు. విజయవాడ సీపీ ఆఫీసులో ఆమెను ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల తీరును మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబు ఖండించారు. విజయవాడలో ఘటనకు ..గుంటూరులోని రమేశ్ ఆసుపత్రిలో పనిచేసే వైద్యురాలికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. మమత ఇటీవల కరోనా బారినపడగా.. కోలుకుని, హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో రమేష్ ఆస్పత్రి కొవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్నారు. ఇటీవల భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పది మంది కరోనా బాధితులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు.