తిరుపతి, ఆగస్టు 15,
భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానంలో శనివారం నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తొలుత భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.
పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీపద్మావతీ వేంకటేశ్వరుల కైంకర్యాలను నిర్వహిస్తున్న అర్చక, కార్యనిర్వాహక, భద్రతాసిబ్బందికి, విశ్రాంత ఉద్యోగులకు, విద్యార్థినీ విద్యార్థులకు, భక్తకోటికి, శ్రీవారిసేవకులకు 74వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు ప్రపంచం మొత్తం కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ విపత్కర సమయంలో తితిదే అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం మరియు తిరుపతి కార్పొరేషన్ సిబ్బందితో కలసి సమన్వయంతో స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు, తమను తాము రక్షించుకుంటూ విశేష సేవలను అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో త్వరలో ప్రపంచం కరోనా బారి నుండి బయటపడగలదని విశ్వసిస్తున్నాను.
ప్రపంచం మొత్తాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు టిటిడి అనేక ధార్మిక కార్యక్రమాలు చేపట్టింది. . ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపయజ్ఞం, శ్రీశ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం నిర్వహించాం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో రాహుగ్రహ చూడామణి సూర్యగ్రహణ జపయజ్ఞం నిర్వహించాం. . అదేవిధంగా, లోకక్షేమం కోసం ‘‘యోగవాశిస్టం - శ్రీ ధన్వంతరి మహామంత్రం’’ పారాయణం నిర్వహించాం.
జూన్ 11 నుండి సుందరకాండ పారాయణం, జూలై 15 నుండి విరాటపర్వం పారాయణం జరుగుతున్నాయి. ఈ రెండు కార్యక్రమాలను కోట్లాది మంది భక్తులు వీక్షిస్తున్నారని అన్నారు
లాక్డౌన్లో టిటిడి సహాయక చర్యలు
మార్చి 24వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ నేపథ్యంలో తిరుపతిలోని వలసకూలీలు, అన్నార్థులకు టిటిడి బాసటగా నిలిచింది. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా మార్చి 28వ తేదీ నుండి ఏప్రిల్ 25వ తేదీ వరకు దాదాపు 36 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేశాం. అదేవిధంగా, మూగజీవాల కోసం పశుగ్రాసం, ఆహారం కూడా అందించామని అన్నారు.
శ్రీ పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో వైద్య పరికరాల కోసం రూ.19 కోట్లు మంజూరుచేశాం. కోవిడ్ సహాయక చర్యల కోసం తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, మాధవం విశ్రాంతి గృహాలు, రెండో సత్రం, తిరుచానూరులోని పద్మావతి నిలయం భవనాలను జిల్లా యంత్రాంగానికి అప్పగించామని అన్నారు.
ఉద్యోగులు, భక్తుల ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ దాదాపు 80 రోజుల తరువాత, జూన్ 8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభించాము. తితిదే నిబంధనలు పాటిస్తూ సంతృప్తికరంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్న భక్తులను అభినందిస్తున్నాము.
దేశవ్యాప్తంగా అనేక ప్రముఖ దివ్యక్షేత్రాలు ఇప్పటికీ ఇంకా దర్శనాన్ని ఇవ్వలేకపోయినా, టిటిడి మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కోవిడ్ నిబంధనలను నిబద్దతతో అమలుచేస్తూ ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మంది భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించామని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో పి.బసంత్కుమార్, జెఈవో(విద్య, ఆరోగ్యం) ఎస్.భార్గవి, సివిఎస్వో గోపినాథ్జెట్టి, అదనపు సివిఎస్వో శివకుమార్రెడ్డి, ఎఫ్ఏ అండ్ సిఏవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ రమేష్రెడ్డి, డిఎల్వో రెడ్డెప్పరెడ్డి, సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో ఆనందరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.