విజయవాడ, ఆగస్టు 15,
వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఆర్టీసీలో నగదు రహిత టికెటింగ్ విధానం అమలు కానుంది. ఆన్‌లైన్ టికెటింగ్ కోసం ఏపీఎస్‌ఆర్టీసీ యాప్ ప్రవేశపెట్టి ప్రయాణికులు సులువుగా ప్రయాణం చేసేలా వీలు కల్పించనుంది. దేశంలోనే మొబైల్ ఆధారిత టికెటింగ్ వ్యవస్థను ఒక్క ఏపీఎస్‌ఆర్టీసీ మాత్రమే ప్రవేశపెట్టనుంది. ఈ నెలాఖరున మొబైల్ ఆధారిత టికెటింగ్‌కు అధికారులు టెండర్లు నిర్వహించనున్నారు. తాజాగా ప్రీ బిడ్ సమావేశం నిర్వహించగా, 92 సాఫ్ట్‌వేర్ కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా మచిలీపట్నం–అవనిగడ్డ రూట్‌ను ఆర్టీసీ అధికారులు సర్వే చేశారు. ఇందులో సానుకూల ఫలితాలు రావడంతో ఆర్టీసీలో ఆన్‌లైన్ టికెటింగ్‌ను దశల వారీగా ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం 39 శాతం మంది మాత్రమే ఆర్టీసీలో ఆన్‌లైన్ టికెట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. మిగిలిన 61 శాతం ఆఫ్‌లైన్‌లోనే టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. మరింత మంది ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందేలా ఆర్టీసీ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఈ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ఆర్టీసీ సిబ్బంది తమ సొంత సెల్‌ఫోన్లతోనే టికెట్ జారీ, టికెట్ల వాలిడిటేషన్, టికెట్ చెకింగ్ చేసేలా యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విధానంపై సాఫ్ట్‌వేర్ కంపెనీల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దేశంలో మిగిలిన ఆర్టీసీలతో పోలిస్తే ఏపీఎస్‌ఆర్టీసీకి ఆన్‌లైన్ టికెటింగ్‌లో ఆదరణ ఎక్కువగా ఉంది