కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ 'గుడ్‌లక్ సఖిస. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం ఈ సినిమా టీజర్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు.
తమిళ వెర్షన్ టీజర్‌ను స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి, మలయాళం వెర్షన్ టీజర్‌ను అక్కడి స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ రిలీజ్ చేశారు. టీజర్ చాలా ఆహ్లాదకరంగా, వినోదాత్మకంగా కనిపిస్తోంది. అన్ని రకాల ప్రేక్షకుల్నీ, ప్రధానంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఈ చిత్రం రూపొందుతోందనే విషయం ఈ టీజర్‌ని చూస్తే అర్థమవుతోంది. హాస్యం పండించే పలు సన్నివేశాలు, చూడముచ్చటగా ఉన్న కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి జోడీ, వండర్‌ఫుల్ మ్యూజిక్, మంచి డ్రామా, కృషితో ఏ స్థాయికైనా ఎదగవచ్చనే అంశం, మన రాతను మనమే మార్చుకోవాలనే సందేశంతో టీజర్ ఇంప్రెసివ్‌గా కనిపిస్తోంది.
టీజర్ ప్రకారం ఏదో బలమైన కారణంతో కీర్తి సురేష్‌ను ఊళ్లో వాళ్లందరూ "బ్యాడ్ లక్ సఖి" అని పిలుస్తుంటారు. అయితే అదేమీ ఆమె పట్టించుకోదు. ఇప్పటివరకూ అటు ఇంటెన్సిటీ ఉన్న శక్తిమంతమైన పాత్రలు, ఇటు సాఫ్ట్ రోల్స్ పోషించి వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆది పినిశెట్టి తొలిసారిగా ఇందులో హిలేరియస్ రోల్‌ను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని కీర్తి "గోలీ రాజు" అని పిలుస్తుంటే అతడు ఉడుక్కోవడం సరదాగా ఉంది. అతడితో "నువ్ రామారావ్ అయితే, నేను సావిత్రి" అని కీర్తి అనడం ఆకట్టుకుంటోంది. షూటింగ్ ట్రైనర్ జగపతిబాబు, కీర్తి మధ్య సంభాషణ మోటివేటింగ్‌గా ఉంటే, ఆయనతో "సరే యాడ కాల్చాలా?" అంటూ పిస్టల్ పట్టుకున్న కీర్తి చెప్పడం నవ్వులు పండించింది.
టీజర్‌లో రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ అలరించేదిగా ఉండగా, చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ సూపర్బ్ అనిపిస్తోంది. ఎడిటింగ్ షార్ప్‌గా, నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. 'గుడ్ లక్ సఖి'పై అంచనాలు టీజర్‌తో మరింతగా పెరిగాయి. నిర్మాతల్లో ఒకరైన శ్రావ్య వర్మ ఆధ్వర్యంలో అధిక శాతం మహిళా సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తుండటం గమనార్హం. వారందరికీ ఇది గర్వకారణమయ్యే సినిమా అవుతుందనడంలో సందేహం లేదు. జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తోన్న 'గుడ్ లక్ సఖి' తెలుగు, తమిళ, మలయాళంలో త్రిభాషా చిత్రంగా ఏక కాలంలో నిర్మాణమవుతోంది.