*ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుంద మానందకంద మనిమేషమనంగతంత్రమ్!*
*ఆకేకరస్థిత కనీనికపక్ష్మనేత్రం భూత్యైభవేన్మమ భుజంగ శయాంగనాయాః!!*
మధురమైన భావనలో కళ్లు మూసుకుని ఉన్న ముకుందుడిని అమ్మవారి చూపులు చేరాయి. ఆ చూపులు చాలా సంతోషంగా చేరాయి. ఒక మన్మథ విలాసంలా ఆ చూపు చేరింది. ఆ చూపు శృంగారపరమైన కనుసైగలా ఉంది. భుజంగ శయనుడైనటువంటి ఆ ఆదినారాయణమూర్తి, సతి అయినటువంటి ఆ లక్ష్మీదేవి చూపు నాకు ఐశ్వర్యమును కలిగించును గాక!
ఆ తల్లి చూపు జగత్తుకంతటికీ నాయకుడైనటువంటి శ్రీమహావిష్ణువుకు శృంగార భావాన్ని కలిగిస్తే, ఆమె బిడ్డలమైన మనకు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది.
బాలుడైన శంకారాచార్యులకు ఆ చూపులో దయామయమైన భావన కనిపించింది.
‘అమ్మ నన్ను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది’ అని అనుకున్నాడు. అంటే దేవతల రూపం, అనుగ్రహం, విలాసం మనం ఎలా తీసుకుంటే అలా ఉంటాయి.
శత్రుత్వ భావనతో ఆరాధించే వారికి శత్రువుగానే కనిపిస్తాడు.
హిరణ్యకశిపుడు, రావణుడు ఉదాహరణ.
శృంగార భావనతో ఆరాధించే వారికి అలాగే కనపడతాడు. గోపికలు ఉదాహరణ.
స్నేహభావంతో ఆరాధించే వారికి అలాగే కనిపిస్తాడు. అర్జునుడు ఉదాహరణ.
భక్తి భావంతో ఆరాధించే వారికి అలాగే కనిపిస్తాడు. నారదుడు ఉదాహరణ.
జ్ఞానమార్గంలో ఆరాధించే వారికి అలాగే కనపడతాడు. శుకుడు ఉదాహరణ.
ఇవే నవవిధ భక్తి మార్గాలు.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో