YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*ఘన భారతావని వారసులం*

*ఘన భారతావని వారసులం*

మానవులుగా జన్మించవలసి వస్తే దేవతలు ఎంపిక చేసుకొనే ప్రదేశం-భారతదేశం. వివేకవంతులైన విదేశీ సాధకుల జ్ఞాన పిపాసకు చల్లని చలివేంద్రం ఈ దేశం. భారతదేశం ప్రపంచానికి భగవద్గీతను ప్రసాదించింది. అసాధారణమైన స్ఫూర్తిని అందించింది. కాళిదాస వ్యాస వాల్మీకాది మహామహా కవులకు ఈ దేశం జన్మనిచ్చింది. భారత భాగవత రామాయణాది మహా కావ్యాలను సృజించింది. ఏ రంగాన్ని అధ్యయనం చేసినా- ఆ రంగానికే ఆణిముత్యాలనదగిన ప్రతిభామూర్తుల కారణజన్ములను లోకానికి కానుక చేసింది. సాక్షాత్తు అవతారమూర్తులకే ఈ దేశం అమ్మఒడిగా నిలిచింది. తాను తరించింది, లోకాన్ని తరింపజేసింది.
‘భారతదేశం ఎంతో ప్రత్యేకమైనది. భగవదనుగ్రహం సాధించిన కొద్ది దేశాల్లో భారతదేశం ముఖ్యమైనది’ అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా స్పష్టంగా ప్రకటించింది. ‘ఏ దేశపు ఆకాశం దిగువన మానవ మస్తిష్కం పూర్తిస్థాయి వికాసాన్ని సాధించింది? మనిషి కోరదగిన కానుకలన్నింటినీ ఏ దేశం సంపూర్ణంగా చేజిక్కించుకొంది? విశ్వమానవ సమస్యలను కూలంకషంగా అవగాహన చేసుకొని, వాటికి పరిష్కారాలను సూచించగల సత్తాను ఏ దేశం సాధించింది? ఇలా నన్ను ఎవరైనా అడిగితే, తక్షణం నేను భారతదేశం వైపు వేలు చూపిస్తాను’ అని ప్రకటించాడు- ప్రసిద్ధ జర్మన్‌ తత్వవేత్త మేక్స్‌ ముల్లర్‌! అదీ- ఈ దేశ నాగరికత! అదీ- ఈ దేశం ఘనత!
మనల్ని మనం పరిచయం చేసుకున్నప్పుడు- మన పేరు, వ్యక్తిగత విశేషాలు, ఉద్యోగం, మాతృభాష... వంటివాటిని ప్రస్తావిస్తాం. విదేశాల్లో అయితే, మన పరిచయం ‘మేము భారతీయులం’ అనే మాటతో మొదలవుతుంది. అలాంటి సందర్భాల్లో మన గొంతులోంచి తొంగిచూసే ఒకానొక అనిర్వచనీయమైన గర్వరేఖను మనం గుర్తించవచ్ఛు ఏదో తెలియని పురావైభవపు వారసత్వ హోదా ఆ పలుకులో ధ్వనించడాన్ని మనం గమనించవచ్ఛు ఆ సౌభాగ్య వీచిక, ఆ హుందాతనపు సూచిక- మన పూర్వీకుల భిక్ష. మనది రుషుల పరంపర, పరమ గురువుల వారసత్వం. ‘ఈ దేశం నాకు ఏమీ ఇవ్వలేదు’ అనుకోవడం మన భావదారిద్య్రానికి, అజ్ఞానానికి గట్టి నిదర్శనం. మనదేశం ఘనత ఎంతటిదో మనకే తెలియకపోవడం వట్టి అవివేకం.
‘నా దేశం భగవద్గీత... నా దేశం అగ్నిపునీత సీత... నా దేశం కరుణాంతరంగ... నా దేశం సంస్కార గంగ...’ అన్నారు సినారె. ఆ తరహా అద్భుత భావన మన నరనరాల్లో ఉప్పొంగితే తప్ప, ‘నేను భారతీయుణ్ని’ అని చెప్పుకొనే అర్హత మనకు దక్కదు. ఆ పరమాద్భుత సంపదకు మనం వారసులు కావడం వీలుకాదు.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts