*_శీల సంపద ‘సౌశీల్య సంపద కలవాడికి సముద్రం పిల్ల కాలువలా కనిపిస్తుంది. మేరు పర్వతం చిన్న రాయిలా అగుపిస్తుంది. సింహం- జింకపిల్లలా తోస్తుంది’ అంటాడు భర్తృహరి మహాకవి._*
*_సచ్ఛీలత కలిగినవాడికి పాము పూలదండగా, కాలకూట విషం అమృతంగా మారతాయని ఆయన సుభాషితం చెబుతుంది._*
*_సదాచారుడికి పరాజయమే ఉండదు. ఎందుకంటే- అతడు ధర్మవర్తనుడు, సత్యసంధుడు, పర హిత వ్రతుడై ఉంటాడు. ఏ ఆపదా ఏమీ చేయలేదు. ఏ సమస్యా కుంగదీయదు. ఏ దుఃఖమూ దుర్బలుణ్ని చేయదు._*
*_*మనిషి తన జీవిత కాలంలో ఏ క్షణమూ విడవకూడనిది, మరవరానిది- సచ్ఛీలం !*_*
*_ఆరోగ్యం లోపించినా, సంపద తరిగినా మళ్లీ ఏదో విధంగా సంపాదించుకోవచ్చు. *శీలసంపద పోతే, తిరిగి పొందడం దుర్లభం !*_*
*_భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సౌశీల్య సంపదను మానవుడు ఎంతగా పెంచుకుంటే అంత మంచిదని ‘మను స్మృతి’ చెబుతోంది. అతడు ఆర్జించే విద్య, విత్తం, కీర్తి- అవి ఏవైనా శీలసంపద లేనిదే శోభిల్లవని సనాతన ధర్మం స్పష్టీకరిస్తోంది._*
*_మనిషికి మంచి నడవడి ప్రధానమని, అది నశిస్తే ఏ విధమైన శక్తీ అతణ్ని రక్షించలేదని ‘విదుర నీతి’ వెల్లడిస్తోంది. సచ్ఛీలి కానివాడు కుటుంబంలో, సమాజంలో ఒంటరివాడవుతాడు. ఎంత బలగం ఉన్నా అతణ్ని ఎవ్వరూ కాపాడలేరు._*
*_*శీలవంతుడు అంటే ఎవరు ?*_*
*_ధార్మికుడు, సకల ప్రాణుల్ని ప్రేమించేవాడు, సాటివాడైనా అపరిచితుడైనా మేలు చేసేవాడు- సచ్ఛీలుడు. సంయమనం, క్షమ, సహనం కలిగి ఉండటంతో పాటు- తల్లిదండ్రుల్ని, గురువుల్ని, ఇతర పెద్దల్ని ఆదరించే సంస్కారం గలవాడు శీలవంతుడు. అహింస, ప్రేమ, సత్యసంధత వంటి సద్గుణాల్ని అలవరచుకున్నవాడు; క్రమశిక్షణ, సమయపాలన, చిత్తశుద్ధి కలిగినవాడే సచ్ఛీలుడని మన శాస్త్రాలు చెబుతున్నాయి._*
*_సజ్జనుడనేవాడు అరిషడ్వర్గాలకు, సప్త వ్యసనాలకు నిరంతరం దూరంగానే ఉంటాడు. మనిషికి సచ్ఛీల సంపద సిద్ధింపజేయడానికి పూర్వులు ప్రత్యేక సూత్రాల్ని నిర్దేశించారు._*
*_యాజ్ఞవల్క్య స్మృతిలో వాటిని ‘ *యమ-నియమాలు* ’గా పేర్కొన్నారు._*
*_1. బ్రహ్మచర్యం,_*
*_2. దూషణ భూషణలకు అతీతంగా ఉండటం,_*
*_3. పరమాత్మ ధ్యానం,_*
*_4. నిష్కపటం,_*
*_5. పరుల సంపద ఆశించకపోవడం,_*
*_6. మధుర సంభాషణ,_*
*_7. ఇంద్రియ నిగ్రహం- వీటిని *యమము* లంటారు._*
*_a. స్నానం,_*
*_b. మౌనం,_*
*_c. ఉపవాసం,_*
*_d. యజ్ఞ నిర్వహణ,_*
*_e. వేదాధ్యయనం,_*
*_f. గురు శుశ్రూష,_*
*_g. బ్రహ్మచర్య దీక్ష,_*
*_h. శాంత స్వభావం,_*
*7_i. విధి నిర్వహణలో జాగరూకత_*
*_- వీటిని *నియమాలు* గా పేర్కొంటోంది స్మృతి. *తేజస్సు, క్షమ, ధైర్యం, అంతశ్శుద్ధి, బాహ్యశుద్ధి, నిరహంకారం* - మానవుడి శీల సంపదను రెట్టింపు చేస్తాయి._*
*_ఈ లక్షణాలతో మానవుడు భగవంతుడు కాగలడని ‘భగవద్గీత’లో కృష్ణపరమాత్మ బోధిస్తాడు._*
*_రామాయణ భారత భాగవతాల్లో, అష్టాదశ పురాణాల్లో సౌశీల్యవంతుల పాత్రలు మనకు కొల్లలుగా కనిపిస్తాయి. అవే నేటి మానవాళికి అనుసరణీయాలు. *శీలానికి అంతశ్శుద్ధి, బాహ్యశుద్ధి రెండూ అవసరమే !*_*
*_విద్య, ధనం, యశస్సు పుష్కలంగా లభించినా కొందరు మాననీయులు కాలేరు. వారి మనసు వికారాలతో నిండి ఉండటమే అందుకు కారణం._*
*_శీలాన్ని మించిన సిరులు లేవని, అదే మనిషిని అందరికన్నా గొప్పగా చేస్తుందని యోగి వేమన అంటాడు._*
*_సచ్ఛీలుడి సాత్విక బుద్ధి ఒక్కటే దైవ తత్వాన్ని అందించగలుగుతుంది.దైవ చింతన సచ్ఛీలుడికే సత్ఫలితమిస్తుంది-_*
*_అధర్మార్జనతో గుళ్లు గోపురాలు కట్టించేవాడికో, కీర్తి కాంక్షతో దానధర్మాలు చేసేవాడికో కాదు._*
*_ప్రాపంచిక విషయ కశ్మలంలో కొట్టుమిట్టాడేవాడికీ పారమార్థిక చింతన అసలే ఒంటపట్టదు._*
*_వ్యామోహ మమకారాలు తగ్గించుకుంటున్న కొద్దీ, మానవుడు సుగుణాలు పెంచుకోగలుగుతాడు.అప్పుడే ముక్తిసాధనకు ఏ కంటకాలూ లేని చక్కటి బాట ఏర్పడుతుంది !_*
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో