YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫలించిన నిరీక్షణ

ఫలించిన నిరీక్షణ

ఖమ్మం జిల్లా అక్కినాపురం తండాలో తాగు నీటి ఇక్కట్లకు తెరపడింది. ఎనిమిదేళ్లుగా ఇక్కడి ప్రజలు మంచి నీటి కోసం పడుతున్న కష్టాలపై స్పందించిన అధికార యంత్రాంగం సమస్య పరిష్కారానికి కృషి చేసింది. తండాకు మంచి నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంది. అక్కినాపురం తండాలో ఏళ్లతరబడిగా తాగునీటి కష్టాలు కొనసాగుతున్నాయి. ఇక్కడి గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు మండలంలోనే తొలిసారిగా మిషన్‌ భగీరథ జలాలు విడుదల చేశారు. దీంతో స్థానికుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. మంచి నీటి కోసం తాము పడ్డ శ్రమ, చేసిన ఆందోళనలు సత్ఫలితాలనిచ్చాయని అంతా అంటున్నారు. సురక్షిత మంచినీరు అందుబాటులోకి రావడంతో రోజూ నీటి కోసం కిలోమీటర్ల మేర నడిచే అవస్థలు తొలగిపోయాయని చెప్పారు. 

 

వేసవిలో భూగర్భజలాలు అడుగంటి తండా గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. 2010 నుంచి తండావాసులు తాగు నీటి నానాపాట్లు పడుతున్నారు. భూగర్భ జలాలు క్షీణించిపోవడం వ్యవసాయ క్షేత్రాల్లోని బోర్లలోనూ నీరు లేకపోవడంతో వారు చాలాదూరం ప్రయాణించి నీటిని తెచ్చుకోవాల్సి వచ్చేది. తాగు నీరు తెచ్చుకోవడం కోసం వారు కూలిపనులకు సైతం వెళ్లలేని దుస్థితి. దీంతో ఆర్ధికంగా నలిగిపోయేవారు. ఈ కష్టాలన్నింటిపై స్పందించిన అధికారయంత్రాంగం ఎట్టకేలకు నీటి సరఫరాకు చర్యలు తీసుకుంది. అందుబాటులో ఎక్కడా మోటర్లు లేకపోవడంతో మిషన్‌ భగీరథ పనులను వేగవంతం చేసింది. హిమాంనగర్‌లోని ఓవర్‌హెడ్‌ ట్యాంకుకు నీటిని సరఫరా చేసి అక్కడ నుంచి ప్రధాన పైపులైన్‌ ద్వారా గ్రామంలోని రక్షిత పథకం పైపులకు అనుసంధానించారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. మొత్తానికి తండా కూడలిలో నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో స్థానికుల ఆనందం అవధులు దాటింది. 

Related Posts