విజయవాడ, ఆగస్టు 17,
చాలా మంది అనుకున్నట్టుగా జగన్ .. తనకు భజన చేసేవారికి అందలాలు వేస్తారని.. కానీ, ఇది నిజం కాదని అంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితంగా ఉండే కొందరు నాయకులు. ఇటీవల ఓ పెద్ద నివేదికను తీసుకుని పెద్దిరెడ్డి సీఎం జగన్ దగ్గరకు వచ్చి అందించారట. దీంతో అప్పటి వరకు చాలా గోప్యంగా ఉంచిన ఈ విషయంపై సీఎంవోలో గుసగుసలు వినిపించాయి. ఇక, ఈ విషయం ఆనోటా ఈనోటా వినబడి.. ఆఖరుకు మీడియా చెవిలో పడింది. దీంతో కూపీలాగగా.. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిపైనా, మంత్రులపైనా కూడా జగన్ ఓ కీలక విషయంపై కూపీలాగారని తెలిసింది.కొన్నాళ్లుగా ప్రభుత్వంపై ఇసుక, మద్యం వివాదాలు చుట్టుముడుతున్నాయి. మీ మనుషులే ఇసుకను అక్రమంగా అమ్ముకుంటూ.. సొమ్ము చేసుకుంటున్నారని, మద్యం విక్రయించి.. కోట్లు గడిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారనే అంశాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఇసుక విషయంలో ఎవరి ప్రమేయం ఉందో తెలుసుకునేందుకు ఇప్పటికే ఇంటిలిజెన్స్ ను పురమాయించిన జగన్.. తర్వాత ఈ విషయంపై నిగ్గు తేల్చేందుకు మంత్రి పెద్దిరెడ్డికి పురమాయించారని తెలిసింది. దీంతో పూర్తిస్థాయిలో సమాచారం సేకరించిన పెద్దిరెడ్డి సీఎంకు నివేదిక అందించారట.ఈ నివేదికకు సంబంధించి అత్యంత రహస్యంగా అందిన సమాచారం మేరకు.. కొత్తగా వైఎస్సార్ సీపీలోకి అడుగులు వేసిన చాలా మంది నేతలు.. చిన్న చిన్న పనులకు కూడా కక్కుర్తి పడుతున్నారని, గత ప్రభుత్వంలోనూ వీరు ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారని, ఇప్పుడు కూడా పార్టీ మారి ఇలాంటి వాటికే పాల్పడుతున్నారని… వీరికి సంపాయించుకోవడమే పరమావధిగా ఉందని పెద్దిరెడ్డి నివేదికలో స్పష్టం చేశారట. అదే సమయంలో ప్రజలతోనూ మమేకం కావడం లేదని, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నారని కూడా పెద్దిరెడ్డి స్పష్టం చేశారటఈ పరిణామాలతో ఎవరెవరు ఇలా వ్యవహరిస్తున్నారు? వారిని నిలువరించడం ఎలా ? అనే అంశాలపై త్వరలోనే జగన్ దృష్టి పెడతారని అంటున్నారు పరిశీలకులు. ఈ లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలకు జగన్ జిల్లాల వారీగా పార్టీ తరపున నియమించిన పార్టీ పరిశీలకులతో వార్నింగ్ ఇప్పిస్తారని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఈ మ్యాటర్ లీక్ అయ్యాక ఎమ్మెల్యేల్లో కాస్త టెన్షన్ మొదలైందట. వాస్తవానికి ఇప్పటికే చేతులు చాస్తోన్న ఇద్దరు ముగ్గురు మంత్రులతో పాటు.. వారి బంధువులకు జగన్ ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వార్తలు తెలిసిందే.