YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హోదాపై పోరుకు యాక్షన్ ప్లాన్

హోదాపై పోరుకు యాక్షన్ ప్లాన్

విజయవాడ, ఆగస్టు 17, 
జగన్ అసలు సౌండ్ చేయరు. ముఖ్యమంత్రినని పదే పదే మీడియా ముందుకు రారు. ఏపీలో ఏం జరిగినా తెలియనట్లే ఉంటారు. కానీ అన్నీ తన మెదడులోనే నిక్షిప్తం చేసుకుంటారు. అదే జగన్ మాస్టర్ పాలిటిక్స్. బీజేపీ ఏపీలో దూసుకురావాలనుకుంటోంది. అది ఇండియా కరోనా అని తన సన్నిహిత మంత్రి కొడాలి నాని అన్నారంటే జగన్ ది కూడా బహుశా అదే భావన అయి ఉంటుంది. ఇవాళ సులువుగా దొరుకుతోంది కాబట్టి టీడీపీని చెడుగుడు ఆడుతోంది. రేపు అది వైసీపీ మీదకు వస్తుంది అని కూడా జగన్ కి తెలుసు. అందుకే ఇప్పటి నుంచే బీజేపీ బాటలో ముళ్ళ కంపలు పేర్చితే కమల రధానికి గాలి పోయి తుస్సుమని ఎక్కడిది అక్కడే ఆగిపోతుంది. అందుకే జగన్ తనదైన రాజకీయానికి తెర తీశారని అంటున్నారు.  కేవలం రెండు రోజుల వ్యవధిలోనే జగన్ ప్రత్యేక హోదా విషయాన్ని రెండు సార్లు తీసుకువచ్చారు. హై కోర్టుకు మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన పిటిషన్లో ప్రత్యేక హోదాను ఆయన ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం. ఇది లాజిక్ తో కూడిన వ్యవహారమే. విభజన చట్టం పరమ పవిత్రం అని గొంతు చించుకుంటున్న టీడీపీకి ఝలక్ లాంటిదే. అదే సమయంలో ఏపీకి అంతా చేశామని నీలుగుతున్న బీజేపీకి కూడా ఇరకాటం పెట్టేదే. ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకూ విభజన చట్టం అమల్లో ఉన్నట్లేనని జగన్ సర్కార్ కొత్త మెలిక పెట్టింది. రాజధాని సహా ఏమైనా మార్చుకునే వెసులుబాటు ఉందని ఓ వైపు చెబుతూనే ప్రత్యేక హోదా అన్న హామీ మీరు బాకీ ఉన్నారు సుమా అని కేంద్రాన్ని హెచ్చరించినట్లుగానే అర్ధం చేసుకోవాలి. ఇక ఆగస్ట్ 15 ప్రసంగంలో కూడా జగన్ ప్రత్యేక హోదా ప్రస్థావనను తీసుకువచ్చారు.ఇవాళ కాకపోతే రేపు, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. ఇది జగన్ నినాదం, చిత్రమేంటంటే ముఖ్యమంత్రి సీట్లో జగన్ ఉండి కూడా హోదా గురించి మాట్లాడుతున్నారు. విపక్ష నేతగా ఆయనే దీని మీద పోరాటం చేశారు. ఇపుడు కూడా మరో పార్టీ హోదా గురించి అసలు తలవడంలేదు. ప్రజలకు అక్కరలేని హోదా నాకెందుకు అని జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీతో సాన్నిహిత్యం నెరపాలని ఆరాటపడుతున్న టీడీపీ పెద్దలుఅసలు హోదా వూసు ఎత్తరు, ఇక ఆశ్చర్యకరంగా కామ్రేడ్స్ కూడా ఈ మాట అనడంలేదు, కాంగ్రెస్ కూడా సైలెంట్ అయింది. అంటే జగనే మళ్లీ ప్రత్యేక హోదాను పూర్తి పేటెంట్ హక్కులతో నినదించాలన్న మాట.బహుశా ఎన్నికల ముందో దానికంటే ముందే హోదానే జగన్ ఆయుధంగా చేసుకుని బీజేపీకి ఇరుకున పెడతారు అంటున్నారు. హోదా అన్నది జనంలో ఉంది. దాన్ని మళ్ళీ రగిలించడం కష్టతరం కాబోదు, హోదా అని అధికార వైసీపీయే మాట్లాడితే ఆ హోరు ఎంతలా రీసౌండ్ చేస్తుందో చెప్పనక్కరలేదు. ఏపీలో పాగా వేద్దామని తెగ ఉబలాటపడుతున్న బీజేపీకి హోదా కంటే బ్రేకులు వేసే ఆయుధం వేరొకటి ఉండబోదు కూడా. జగన్ ఒక్కడే హోదా అని గొంతు చించుకుంటే కచ్చితంగా మిగిలిన పార్టీలు కూడా కోరస్ అందుకొవాల్సిందే. దాంతో ఏపీ జనం ముందు బీజేపీ మరో మారు ముద్దాయి కాక తప్పదు. అంతే కాదు, విభజన హామీలు, వాటి లెక్కలు కూడా జగన్ తీయిస్తున్నారు. కేంద్రం ఏపీకి ఏపాటి సాయం చేసిందో కూడా రేపటి రోజున ఆయన జనం ముందు పెడితే బీజేపీకి, దానితో పొత్తు పెట్టుకున్న వారికి ఎన్ని ఓట్లు వస్తాయో ఇట్టే చెప్పేయొచ్చు. మొత్తానికి జగన్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ కి విరుగుడు కమలనాధుల దగ్గర ఇప్పటికైతే లేదు, రేపటి రోజున ఎలా రిటార్ట్ ఇస్తుందో తెలియదు.

Related Posts