విశాఖపట్టణం, ఆగస్టు 17,
జయసాయిరెడ్డి.. ఆడిటర్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి నడివయసులో వచ్చినా బాగానే ఔపాసన పట్టేశారు. ఆయనకు పార్టీలో ఎన్నో పదవులు ఉన్నాయి. అలాగే ప్రభుత్వంలో కూడా అనేక పదవులు ఉన్నాయి. ఇక ఆయన్ని జగన్ కి దూరం చేయాలని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ రివర్స్ షాట్స్ తో వాటిని తుత్తునియలు చేసి విజయసాయిరెడ్డి ఎప్పటికపుడు బలపడుతూనే ఉన్నారు. ఆయన్ని ఉత్తరాంధ్ర రాజకీయాల నుంచి కదల్చాలని సొంత పార్టీ నుంచి బయట పార్టీల వరకూ అంతా కూడా ఒక్కటిగా చేరి అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం అంతకంతకు రాటుతేలుతున్నారు.విజయసాయిరెడ్డి ఒక్క షాట్ కొడితే అటు సొంత పార్టీతో పాటు, ఇటు విపక్షం కూడా దారికొచ్చేసింది. పార్టీలో సీనియర్ నేత కొయ్య ప్రసాదరరెడ్డిని హఠాత్తుగా వైసీపీలో తప్పించి ఏమీ కాకుండా చేసిన విజయసాయిరెడ్డి వైసీపీ నేతల తోక జాడింపునకు చెక్ పెట్టేశారు. అదే దూకుడు, అదే సాన్నిహిత్యం, జగన్ తో అదే బంధం అని అక్షర సాక్షిగా నిరూపించేశారు. జగన్ విజయసాయిరెడ్డి చెప్పిన మరుక్షణం కొయ్యను పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేయడంతో వైసీపీలో ఎవరూ కిక్కురుమనడంలేదు. విజయసాయిరెడ్డికి ఎక్కడా బలం లేదని, జగన్ వద్ద అసలు విలువ లేదని భ్రమపడిన వారికి ఇలా ఒన్ షాట్ మెనీ బర్డ్స్ అన్నట్లుగా విజయసాయిరెడ్డి చేసి చూపించారు.మరో వైపు తన పరోక్షంలో వైసీపీలోకి దూకేద్దామని భారీ స్కెచ్ గీసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నో చాన్స్ అని చెప్పేసిన నేతగా కూడా విజయసాయిరెడ్డి చాణక్యం చూపించారు. సడెన్ గా గంటా మేనల్లుడి భూ బాగోతం తెర మీదకు రావడం, కేసులు, అరెస్టులు వంటివి చకచకా జరిగిపోయాయి. వీటి వెనక విజయసాయిరెడ్డి మాస్టర్ బ్రెయిన్ ఉందని కూడా అనుమానిస్తున్నారు. ఈ దెబ్బకు గంటాకు, ఆయనను పార్టీలోకి తెద్దామనుకుంటున్న వారికి విజయసాయిరెడ్డి గట్టి ఝలక్ ఇచ్చేశారు. దాంతో ఉత్తరంధ్రా వైసీపీలో ఆయనకు ఇపుడు ఎదురులేకుండా పోతోంది.ఇవన్నీ ఒక ఎత్తు అయితే విశాఖలో దందా బ్యాచ్ అరాచకాలు ఒక్కలా లేవు. ఎక్కడపడితే అక్కడ కబ్జాలు చేస్తూ భూమిని చాప చుట్టేస్తున్నారు. ఇలాంటి వాటికి విజయసాయిరెడ్డిగట్టిగా చెక్ పెడుతున్నారు. తనవారు పరవారు అని చూడకుండా ఎవరు చేసినా దందాకు ఇక చెల్లుచీటీ రాస్తున్నారు. దందాలు చేయాలనుకుంటే వైసీపీ ఏలుబడిలో అసలు కుదిరే వ్యవహారం కాదని కూడా కచ్చితంగా చెప్పేస్తున్నారు. ఈ పరిణామాలతో విశాఖ నగరవాసుల్లో విజయసాయిరెడ్డి ప్రతిష్ట పెరిగింది. అదే సమయంలో జగన్ వద్ద కూడా ఆయనకు మరింతగా పలుకుబడి పెరిగింది అంటున్నారు. ఇక గంటా లాంటి వారిని పార్టీలోకి తెచ్చి సాయిరెడ్డిని సైడ్ చేద్దామని ఎత్తులు వేసిన వారు విజయసాయిరెడ్డి వీరవిహారం చూసి చిత్తు అవుతున్నారు. ఈ మొత్తం పరిణామాలు జగన్ కి తెలుసు కాబట్టే సాయిరెడ్డి మాటకు ఆయన విలువ ఇస్తున్నారని కూడా వైసీపీలో అంటున్నారు.