గుంటూరు, ఆగస్టు 17,
“ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోయినా.. మాకేం కాదు. మాది నాయకులను తయారు చేసే పార్టీ“- అంటూ.. గతంలో అనేక సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రసంగాలు గుర్తున్నాయా ? ఆయనేకాదు.. ఈ పార్టీకి చెందిన ఆయన కుమారుడు లోకేష్ బాబు సహా సీనియర్లు యనమల రామకృష్ణుడు వంటి వారు కూడా పలు సందర్భాల్లో ఇలాంటి మాటలే మాట్లాడారు. నిజమే కావొచ్చు. కానీ, ఇప్పుడు పార్టీ పరిస్థితి ఇలా లేదు. టీడీపీ నుంచి వెళ్తున్న నాయకులే తప్ప.. కొత్తగా పార్టీ తరఫున వెలుగులోకి వస్తున్న నాయకులు ఒక్కరు కూడా కనిపించడం లేదు. దీంతో పార్టీలో కొత్త నేతల హుషారు ఎక్కడా కనిపించడం లేదు. పైగా పార్టీలో ఉన్న సీనియర్లు చాలా మంది నిరుత్సాహంతో ఉన్నారు. చంద్రబాబు వైఖరిపై వీరంతా వ్యతిరేకతతో ఉన్నారనే కథనాలు వస్తున్నాయి.అమరావతి కావొచ్చు.. పార్టీని నడిపే విధానంలో కావొచ్చు.. చంద్రబాబు నూతన పద్ధతులను అవలంబించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కాలానికి తగిన విధంగా చంద్రబాబు దూసుకుపోవడంలో విఫలమవుతున్నారనే వాదన ఉంది. ప్రజల్లో ఇప్పుడు పార్టీపై గతంలో ఉన్న సానుభూతి కూడా కరువైంది. ముఖ్యంగా రాజధానిని కమ్మ సామాజిక వర్గం కోసం కట్టారనే అధికార పార్టీ నేతల విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారనేది వాస్తవం. గత ఎన్నికలకు ముందు నుంచి వైఎస్సార్‌సీపీ కమ్మలను మిగిలిన కులాల నుంచి దూరం చేసే ప్రక్రియ ప్రారంభించి… దానిని ఇంకా కంటిన్యూ చేస్తున్నా టీడీపీ నేతలు ఎవ్వరూ సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారు.అమరావతిలో భూములు ఎవరెవరు కొన్నారు.. ఎక్కడెక్కడ కొన్నారు.. అనే విషయాలను అధికార పార్టీ లెక్కలతో సహా వెల్లడించిన నేపథ్యంలో చంద్రబాబు ఎదురు దాడి చేయలేక పోయారు. మౌనం వహించారు. ఇది ప్రజలకంటే ఎక్కువగా.. సొంత నేతలపైనే ప్రభావం పడింది. దీంతో సీనియర్లు.. మౌనం వహించారు. ఇక పార్టీలో సీనియర్ నేతలు చంద్రబాబు చెప్పిన ఏ మాటను వినే పరిస్థితి లేదు. ఇక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో చంద్రబాబు, లోకేష్ ఫోన్ చేసినా స్పందించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇక పార్టీ సీనియర్ నేతల తనయులు కూడా పార్టీని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. పోనీ.. కొత్తగా ఎవరైనా ఎక్కడైనా పార్టీలో చేరుతున్నారా ? అంటే.. అది కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి లైఫ్ ఉంటుందన్న గ్యారెంటీ లేదని.. రోడ్లమీదకు వచ్చి అనవసరంగా ఆవేశ పడితే మనకు ఇబ్బందులు తప్పవని.. మనం టార్గెట్ అవుతామన్న ఆందోళన వీరిని వెంటాడుతోంది. ఈ పరిణామాలతో టీడీపీ పరిస్థితి దినదినగండంగా మారిపోయింది. పార్టీని నడిపించే తదుపరి నాయకుడు ఎవరు ? అనే ప్రశ్న వస్తే.. అందరూ మరింత మౌనం వహిస్తున్నారు. ఈ పరిణామాలతో చంద్రబాబు రాజకీయ పాఠశాల దాదాపు మూతబడిందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.