విజయవాడ, ఆగస్టు 17,
కృష్ణానదికి వరద పోటెత్తుతుండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాలోని లంక గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బుధవారం నాడు కూడా నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి భారీ వరద కొనసాగింది. అదే ప్రవాహం ప్రకాశం బ్యారేజీ దిగువన కూడా కొనసాగుతుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. బుధవారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజి 70 గేట్ల నుండి 4.68 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.దీంతో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ముంపు సమస్య ఏర్పడింది. కృష్ణా తీరంలోని లంక గ్రామాల్లోకి, సమీప ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. నాగార్జున సాగర్ జలాశయానికి 6.79 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 5.18 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం ఉంది. పులిచింతలకు 5.75 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 3.69 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 582 అడుగులకు చేరింది. పులిచింతల గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 45 టిఎంసిలు కాగా ప్రస్తుతం 35.33 టిఎంసిలకు చేరింది. పులిచింతలకు 5.75 లక్షల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహం రాగా 19 గేట్లు ఎత్తి 3.69 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు. ప్రకాశం బ్యారేజీకి 4.5 లక్షల క్యూసెక్కులు వస్తుండగా బ్యారేజీకి ఉన్న మొత్తం 70 గేట్లను ఎత్తి 4.28 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా నది ఒడ్డునే ఉండవల్లిలో నివాసముంటున్న మాజీ సిఎం చంద్రబాబు నివాసం ముందు వరకూ నీటి ప్రవాహం వెళ్లడంతో లోపలికి నీరు వెళ్లకుండా ఇసుక బస్తాలతో అధికారులు అడ్డుకట్ట వేయించి నీటిని మళ్లిస్తున్నారు. మాచవరం, బెల్లంకొండ, అచ్చంపేట పరిధిలోని 11 గ్రామాల ప్రజలను పాపాయపాలెం పునరావాస శిబిరంలోకి తరలించారు. అచ్చంపేట, తాడేపల్లి, కొల్లూరు. అమరావతి మండలాల్లోని పలు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతిని వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కృష్ణాజిల్లా కలెక్టర్ ఎ.ఎమ్‌డి.ఇంతియాజ్ పరిశీలించారు. విజయవాడ కష్ణలంకలోని 14, 15, 16 డివిజన్లలోని ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పెనమలూరు మండలం యనమలకుదురు కరకట్ట లోపలి భాగంలో నదీ తీరంలో 40 కుటుంబాలను తరలిస్తున్నారు. కంకిపాడు మండలంలోని లంక ప్రాంతాల్లో ఏటిపాయలకు వరద నీరు చేరింది. కృష్ణా జిల్లా పరిధిలోని ప్రకాశం బ్యారేజీ దిగువనున్న లంక గ్రామాలన్నీ జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. వత్సవాయి మండలం పోలంపల్లిలో డ్యామ్ వద్దకు భారీగా నీరు చేరింది. కంచికచర్ల మండలంలో చెవిటికల్లు వద్ద లక్ష్మయ్యవాగుకు వరద పోటెత్తింది. జగ్గయ్యపేట, చందర్లపాడు, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, పెనమలూరు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, మచిలీపట్నం, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లోని 133 గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో నది కరకట్టకు దిగువన లంకల్లోని అరటి, పసుపు, తమలపాకు, పసుపు, కంద, జామ, బొప్పాయి, కూరగాయ తోటలు ముంపునకు గురయ్యాయి.మరో వైపు దశాబ్ద కాలంలో ఎన్నడూలేని విధంగా పోటెత్తుతున్న కృష్ణా నది గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని లంక గ్రామాల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ గ్రామాల్లోని పలువురిని ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు మండలం తోడేళ్లదిబ్బ, కళింగదిబ్బ, తుమ్మలపచ్చికలంక, పాముల్లంక, పిల్లివానిలంక, పొట్టిదిబ్బలంక, ములకలపల్లిలంక, కనిగిరిలంకలకు చెందిన సుమారు వెయ్యి మందిని తోట్లవల్లూరు, వల్లూరుపాలెం హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలకు అధికారులు తరలించారు. వ్యవసాయ పనులకు వెళ్లి లంకల్లో చిక్కుకుపోయిన చల్లపల్లి, మోపిదేవి మండలాల్లోని 30 మందిని రిస్క్యూ టీములు సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. జగ్గయ్యపేట, చందర్లపాడు, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, పెనమలూరు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, మచిలీపట్నం, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లోని 133 గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ, గ్రామ పంచాయతీ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు