అనంతపురం జిల్లాలో రోజురోజుకు నీటికష్టాలు పెరిగిపోతున్నాయి. పదిరోజులకు ఒకసారి నీళ్లు వస్తుండడంతో ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. ప్రభుత్వం టాంకర్ల ద్వారా ఉప్పు నీటిని సరఫరా చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అటు తాగడానికి పనికిరాని నీటిని సరఫరా చేస్తున్న అధికారుల తీరుపై మండిపడుతున్నారు.అనంతపురం మీదుగా నేషనల్ హైవే 44 వెళుతుండడంతో.. ఈ పరిసర ప్రాంతాల్లో, కొందరు అక్రమ నివాసాలేర్పరుచుకున్నారు . పేరుకేమో అనంతపురం శివారు ప్రాంతమే అయినప్పటికీ, ఈ కాలనీలు మాత్రం అటు నగర కార్పొరేషన్ పరిధిలోకి రావు. మరోవైపున, గ్రామపంచాయితీలు కూడా వీరిని నిర్లక్ష్యం చేస్తున్నాయి. . శివారు ప్రాంత పేద ప్రజలు తాగునీటికోసం అలమటిస్తున్నారు. కూలి పనులు కావాలంటే నీటిని, నీళ్ళుకావాలంటే పనులను వదులుకోవాల్సిన దుస్థితి. నగరానికి నీటిని సరఫరా చేసే పైపులైనుకు గండికొట్టి, తమ గ్రామపంచాయితీలకు నీటిని మళ్ళించుకున్న నగరశివారు ప్రాంత ప్రజలు, భవిష్యత్తులో జరగబోయే జలయుధ్ధాలకు శంఖమూదుతున్నారు. పగ్రామీణ ప్రాంతాల నుండీ వచ్చిన వీరందరూ దినకూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరి సమస్యలకు తోడుగా,వేసవిలో తాగునీటి సమస్యకూడా అదనంగా వచ్చిచేరింది. పాపంపేట పంచాయితీ, వడ్డేకాలనీ, విద్యారణ్యనగర్ లతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది.తమ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా.. పెద్దగా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అనంతపురం నగరానికి నీరుసరఫరా చేసే పైపులైనుకు గండికొట్టి, తమపంచాయితీలకు నీటిని మళ్ళించారు కొందరు. పైపులైనుకు గండికొట్టడంతో,నగరంలోని పాతఊరు,ఇతర 8డివిజన్లలో నీటికొరత మొదలైంది. తాగడానికి నీళ్ళు దొరక్క, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.అనంతపురంలోని పాతఊరు,రాణినగర్,ఇతరప్రాంతాల్లో తీవ్రతాగునీటిఎద్దడి వుంది. నిర్దేశించిన సమయం కంటే,మూడు నెలలకు ముందే హెచ్చెల్సీ కెనాల్ కు నీరు విడుదలచేయడం ఆపేశారు. దీంతో,స్టోరేజ్ కెపాసిటీ తగ్గింది. .పాతఊరిలో పూలవ్యాపారులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండలకు తమ పూలు వాడిపోతే, వ్యాపారం దెబ్బతింటుంది. తమ వ్యాపారం కోసం, రోజుకు 150 రూపాయలు ఖర్చుపెట్టికొన్న మినరల్ వాటర్ తో పూలను తడుపుతున్నామంటున్నారు.తాగు నీటి కోసం ఉప్పు నీటిని పంపుతున్నఅధికారుల తీరుపైనా... మండిపడుతున్న స్థానికులు ఉన్న నీటిని పట్టుకునేందుకు సిగపట్లు పడుతున్నారు. నీళ్లు తాగాలంటే.. పని మానేయాల్సిన పరిస్థితి నెలకొంది.