YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ ప్రారంభమైన బెట్టింగ్ మాఫియా

మళ్లీ ప్రారంభమైన బెట్టింగ్ మాఫియా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తో... జిల్లాలో బెట్టింగ్‌ జోరందుకుంది. ఆట వారిది, జూదం మాది అంటూ కొందరు బ్రోకర్లు క్రికెట్‌ టోర్నీ ద్వారా కాసుల పంటకు సిద్ధమయ్యారు. లాడ్జీలు, హోటల్స్, అపార్ట్‌మెంట్లు, టీ కేఫ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, స్థావరాలుగా చేసుకుని కొందరు చెన్నై, బెంగళూరు కేంద్రంగా చక్రం తిప్పుతున్నారు. గంటల వ్యవధిలో భారీగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో పేదలు, యువకులు ఈ ఊబిలో చిక్కుకుపోతున్నారు. పలు ప్రాంతాల్లో సబ్‌బుకీలను ఏర్పాటు చేసుకొని రాజకీయ నేతలు, కొందరు పోలీసుల అండదండలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌ రాయుళ్ల ప్రధాన దృష్టంతా యువతపైనే ఉంది. కాలేజీ విద్యార్థులు, చిన్నచిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారిని సబ్‌బుకీలు డబ్బుల ఆశ చూపి బెట్టింగ్‌ ఊబిలోకి దింపుతున్నారు.తొలి బాల్‌ నుంచి చివరి బాల్‌ వరకు బెట్టింగ్‌ కాస్తున్నారు. ఫోర్, సిక్స్, హాఫ్‌ సెంచరీ అంటూ బ్యాట్స్‌మన్‌పై, వికెట్, పరుగు ఇస్తాడు అంటూ బౌలర్‌పై బెట్టింగ్‌ కడుతున్నారు. భారీ మొత్తంలో బెట్టింగ్‌లు జరుగుతున్నా పోలీసులు పట్టిం చుకోకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని కొంతమంది అంటున్నారు.జట్టు ప్రాముఖ్యత, మ్యాచ్‌ స్వరూపం, బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో ఆటగాళ్లను బట్టి రూ.1000 నుంచి లక్షలు, కోట్ల వరకు పందేలు కాస్తున్నారు. బుకీకి, ఫంటర్‌కు మధ్య పరిచయం లేకుండానే ఆన్‌లైన్‌ ఖాతాల ద్వారా లావాదేవీలు సాగుతున్నాయి. బుకీలు ఎవరికంటే వారికి అవకాశం ఇవ్వ రు. వారి పరిధిలో ఏజెంట్లు, నమ్మకమున్న సభ్యుడు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. బెట్టింగ్‌కు అర్హత పొందిన వారిని ఫంటర్‌ అంటారు. బుకీ అకౌంట్‌లో ఫంటర్‌ స్థాయిని బట్టి కొంత సొమ్ము జమ చేసిన తర్వాత బెట్టింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. మ్యాచ్‌ ప్రారంభమయ్యే సమయానికి 40 నుంచి 30 నిమిషాల ముందు ఎంతమంది ఫంటర్లు బెట్టింగ్‌లో పాల్గొం టారో బుకీలు ఫోన్‌ చేసి చెబుతారు. గెలుపొందిన తర్వాత బ్యాంక్‌ టైమ్‌ నాటికి లేదా ఆన్‌లైన్‌ ద్వారా ఫంటర్‌ ఖాతాలో డబ్బులు జమచేస్తారు. ఫంటర్‌ ఓడిపోతే బుకీ ఖాతాలో డబ్బులు జమ చేయాలి.మ్యాచ్‌ ముగిసే లోపు ఫలానా బ్యాట్స్‌మన్‌ ఇన్ని ఫోర్లు, సిక్స్‌లు కొడతారని, ఒక్కో ఫోర్‌కు రూ.2 వేలు, సిక్స్‌కు రూ.10 వేల వరకు బెట్టింగ్‌ కాస్తున్నారు. చిత్తూరు నగరానికి చెందిన ఒక వ్యక్తి శుక్రవారం జరిగిన కోల్‌కతా వర్సెస్‌ గుజరాత్‌ లయన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో గంభీర్‌పై బెట్టింగ్‌ కాసి దాదాపు రూ.30 లక్షలు గెలుచుకున్నట్లు సమాచారం.బెట్టింగ్‌ జాడ్యం నగరాలు, పట్టణాలు దాటి పల్లెలను కూడా తాకింది. స్మార్ట్‌ ఫోన్‌ పుణ్యమా స్కోర్లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పందేలు కాస్తున్నారు. కొన్ని బృందాలు చిత్తూరు, పుత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఎవరికీ అనుమానం రాని, జన సంచారం ఎక్కువగా ఉండేచోట ఇళ్లను అద్దెకు తీసుకొని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు సమాచారం. పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది. 

Related Posts