అమరావతి ఆగస్టు 17,
గోదావరి వరదలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష జరిపారు. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల ఉదారంగా ఉండాలన్న సీఎం, ఖర్చుకు వెనుకాడకుండా అన్ని రకాల సదుపాయాలు అందించాలని ఆదేశించారు. కోవిడ్ను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. విపత్తు నిర్వహణా బృందాలను అవసరమైన చోట్ల పెట్టుకోవాలని అన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్.జగన్ తో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడారు. గోదావరి వరద, దీని వల్ల తలెత్తిన పరిస్థితులపై వారినుంచి సీఎం సమాచారం తీసుకున్నారు. సహాయ శిబిరాల్లో సౌకర్యాలకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు మంచి భోజనం అందించడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. నిత్యావసర వస్తువుల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు.