YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

చైనా వ్యాక్సిన్ కు పేటెంట్

చైనా వ్యాక్సిన్ కు పేటెంట్

బీజింగ్, ఆగస్టు 17  
ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న మహమ్మారి కరోనా వైరస్ తొలిసారి చైనాలోనే వెలుగుచూడగా... వ్యాక్సిన్‌ అభివృద్ధిలో డ్రాగన్ దూకుడుగా ఉంది. చైనాకు చెందిన క్యాన్‌సైనో బయోలాజిక్స్‌, బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘క్యాన్‌సైనో’ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. ఇప్పటికే రెండో దశ ట్రయల్స్‌ పూర్తికాగా.. సానుకూల ఫలితాలు వచ్చాయి. తాజాగా, కొవిడ్ 19 వ్యాక్సిన్ ఆడ్5 ఎన్కావ్ కు గానూ చైనా పేటెంట్ హక్కులు పొందింది.ఆ దేశానికి చెందిన ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ రెగ్యులేటర్ యంత్రాంగం వద్ద లభ్యమైన పత్రాల ఆధారంగా చైనా మీడియా ఈ వివరాలను తెలిపింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌కు పేటెంట్ పొందిన తొలి సంస్థ క్యాన్‌సినో అని, బీజింగ్‌ ఆ హక్కులను ఆగస్టు 11నే జారీ చేసిందని పేర్కొంది. మరోవైపు, టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ ఈ నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ట్రయల్స్‌ కోసం పలు దేశాలతో చైనా చర్చలు జరుపుతోంది.‘పేటెంట్ మంజూరు టీకా సమర్థత, భద్రతను మరింత ధృవీకరించింది.. దాని మేధో సంపత్తి హక్కుల యాజమాన్యం నమ్మకాన్ని ప్రదర్శించింది’ క్యాన్‌‌సైనో ఓ ప్రకటన విడుదల చేసింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సౌదీ ఆరేబియాలో ప్రారంభిస్తామని ఆ సంస్థ గతవారం ప్రకటించింది. దీంతోపాటు రష్యా, బ్రెజిల్, చిలీ సహా మిగతా దేశాలతోనూ చర్చలు జరుపుతోంది.మరోవైపు, ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌ను ఆగస్టు 12న ప్రకటించిన రష్యా.. తొలి బ్యాచ్ ఉత్పత్తి కూడా పూర్తిచేసినట్టు తెలిపింది. వ్యాక్సిన్ ఉత్పత్తికి పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని, ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్టు పేర్కొంది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సిన్ ప్రయోగాలలో రష్యా పేరు లేకపోవడం గమనార్హం. తమ దేశానికి చెందిన వందలాది మంది వైరాజిస్టులతో పాటు ఇమ్యునాలజిస్టులు, బయో టెక్నాజిస్టులు గత 20 ఏళ్లుగా చేసిన పరిశోధనల ఫలితంగానే కొవిడ్-19 టీకా తమకింత త్వరగా సాధ్యమైందని రష్యా అంటోంది.

Related Posts