విశాఖపట్టణం, ఆగస్టు 17
మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. మరోవైపు గోదావరికి కూడా భారీగా వదర నీరు పోటెత్తుతోంది. దీంతో ధవళేశ్వరం వద్ద ప్రతస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.ఏపీ తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాంద్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో 19 న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. మరోవైపు భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. గోదావరి వరద ఉధృతి అధికంగా ఉంది. వరద ప్రవాహంతో ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరికాసేపట్లో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 17,18,939 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వదర ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు బ్యారేజ్ 70 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 1లక్ష 45వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1లక్ష 30 వేల క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రకాశం బ్యారేజి ఎగువభాగాన ఉన్న మున్నేరు, వైరా, కట్లేరు,విప్ల వాగు, కీసరలో వరద ఉధృతి తగ్గుతోంది.