కడప జిల్లా రాజకీయాలు.. అంతకంతకు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు జిల్లా రాజకీయాల కాకను తారస్థాయికి చేరుస్తోంది. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య సుమారు 3 దశాబ్దాలుగా ఫ్యాక్షన్ నడుస్తోంది. అయితే, 30 ఏళ్లుగా టీడీపీలో ఉండి దేవగుడి ఆదినారాయణరెడ్డి సోదరులపై పోరాడుతున్న తమకు అన్యాయం చేశారన్న భావన రామసుబ్బారెడ్డి వర్గంలో వ్యక్తమవుతోంది. అనుచరులైతే పార్టీని వీడదామంటూ రామసుబ్బారెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే.. రామసుబ్బారెడ్డి మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నారుమొన్నటివరకూ వైసీపీలో కొనసాగిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి, టీడీపీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచీ టీడీపీలోనే కొనసాగుతున్న రామసుబ్బారెడ్డి వర్గం దీన్ని జీర్ణించుకోలేక పోయింది. దీనికితోడు, ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కూడా కట్టబెట్టడాన్ని, రామసుబ్బారెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఓ దశలో, రామసుబ్బారెడ్డి టీడీపీకి గుడ్‌బై చెబుతారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు, రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ అవకాశాన్ని ఇస్తానని హామీ ఇవ్వడంతో, ఆ వర్గం కాస్తంత శాంతించినట్లు కనిపించింది.. ఈ క్రమంలో.. జమ్మలమడుగులో జరిగిన పార్టీ సమావేశాన్ని, తమ కోపాన్ని వ్యక్తం చేసేందుకు వేదికగా ఎంచుకున్నారు.