జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. వాస్తవానికి ఆదివారం అనంత టూర్ చేయాల్సిన పవన్ పర్యటన రద్దు కావడంతో కేడర్ లో అసంత్రప్తి పెరిగింది. ఇప్పటికే జిల్లాలో నెలకొన్న కరవు సమస్యలను అధ్యయనం చేసేందుకు పాదయాత్ర చేయాలని ఉందని అనంతపురంలో జరిగిన సభలో ప్రకటించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని కచ్చితంగా ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా జనసేనాని ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.వపన్ కల్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం రాయలసీమ మొత్తంపై పడుతుందని భావిస్తున్నారు. అనంతపురం అర్బన్ ఏరియాలో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే జనసేనాని జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించి ఉంటారని విశ్లేషిస్తున్నారు. దీంతో పవన్ పోటీ చేస్తే తమకు ఇబ్బంది అవుతుందని ఇతర పార్టీల్లోని నేతలు ఒత్తిడికి గురువుతున్నారు. అనంత సభలో పవన్ ప్రధానంగా రైతులు, చేనేత కార్మికుల సమస్యలు ప్రస్తావించిన నేపథ్యంలో ఈ రెండు వర్గాలతో పాటు ఇతరులు కూడా జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారుఅనంతపురంలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొత్తులు, ఎత్తులు విషయాన్ని పక్కన పెడితే, యువతకు ఎక్కువ సీట్లు ఇస్తానన్న హామీతో యువత ఎక్కువగా జనసేన వైపు మొగ్గు చూపుతూపడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతల వెన్నులో వణుకు పుడుతోంది. గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ, వైపీసీల మధ్య ప్రధానంగా పోరు జరిగింది. 2019 ఎన్నికల్లో ఇది మూడు పార్టీల మధ్య పోటీకి దారితీస్తుంది. జనసేన, టీడీపీ, వైసీపీల మధ్య పోరుగా మారనుంది. జనసేన పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేస్తే టీడీపీ, వైసీపీల్లో ఎవరికి దెబ్బ అన్న అంశంపై విస్తృతంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. మరోవైపు జిల్లాలోని టీడీపీ, కాంగ్రెస్ నేతల్లో కొందరు జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. జనసేనానితో సంప్రదింపులు జరుపుతున్నారని వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది జనసేనలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ నేతల అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం కావడంతో జిల్లాలో టీడీపీ ప్రభ మసకబారుతోందని విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు చెప్పినా నేతల్లో మార్పు రాకపోగా, నేతల గొడవలతో పార్టీ పరువు బజారుకెక్కుతోంది. దీంతో కొంత మంది టీడీపీ నేతలు జనసేన వైపు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోవైపు జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు తమ నేతకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఆ లోగా జనసేనాని జిల్లా సమస్యలపై మరింత ఆధ్యయనం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది పార్టీకి మరింత కలిసొచ్చే అంశమని విశ్లేషిస్తున్నారు.