జగద్గురువులైన ఆది శంకరాచార్యులవారికి సనందుడనే శిష్యుడుండేవాడు. ఆ సనందుడు మిక్కిలి గురుభక్తి విద్యలపై ఆసక్తి కలవాడు. తన ఎకాగ్రత వినయవిధేయతల వలన కొద్దికాలం లోనే విద్యలునేర్చి శంకరభగవత్పాదులకు ప్రియ శిష్యుడైనాడు పద్మపాదుడు. “ఏ కారణముగా సనందుడు గురువుగారికింత ప్రియుడైనాడో” అని చర్చించుకుంటున్న తన శిష్యులను విన్నారు శంకరులు. వారికి సనందుని అపారమైన గురుభక్తిని చూపాలని నిశ్చయించుకున్నారు.
ఒకసారి ఆది శంకరులు తమ శిష్యసమేతముగా గంగాతీరమునకు వెళ్ళినప్పుడు ఆవలి గట్టునున్న సనందుని చూచి “నాయనా! సనందా శీఘ్రముగా ఇటు రా!” అని పిలిచినారు. గురు ఆజ్ఞయే తప్ప ఇతరము గూర్చి ఆలోచించని సనందుడు వెంటనే కళ్ళుమూసుకుని అనన్యమైన గురుభక్తితో ఇవతలి గట్టుకి నీటి మీద నడచి వచ్చాడు! అప్పుడు సనందుడు నీటిలో మునిగిపోకుండా అతని పాదాల క్రింద పద్మాలను మొలిపించింది గంగాభవానీ. ఆ ఆశ్చర్యకరమైన సంఘటన చూసి ముగ్ధులైన శిష్యులు సనందుని గురుభక్తి తెలుసుకున్నారు. అప్పటి నుంచి సనందుడు పద్మపాదుడనే పేరుతో ప్రసిద్ధుడైనాడు.
చోళదేశంలో పుట్టిన పద్మపాదుడు బాల్యము నుంచి అఖండ నృసింహభక్తుడు. స్వామి సాక్షాత్కారము కోసం పవిత్రమైన అహోబిల అడవులలో ఎన్నో ఏండ్లు తీవ్ర తపస్సును చేసినాడు. కాని నరహరి కరుణించలేదు. శిష్యుని భక్తి పరిపక్వమైనదని గ్రహించిన ఆది శంకరులు ఒకనాడు పద్మపాదుని పిలిచి దగ్గరలో ఉన్న చెంచుగుడెం లోని కొండగుహలో నృసింహస్వామికై తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. గురు ఆజ్ఞపై పద్మపాదుడు కొండగుహ చేరి ఘోర తపస్సు ప్రారంభించాడు.
తాపసి వచ్చాడని తెలియగానే పరుగు పరుగున సాధుసేవ చేదామని వచ్చాడు చెంచుగుడెం దొర బయన్న. “సామీ! నేను బయన్నను. ఈ నేల ఏలికను. దేని కోసం నీవు ఇక్కడికి వచ్చావు దొరా”? అని అడిగాడు. “సింహం ముఖముతో మనిషి శరీరంతో ఉండే దేవుని వెదుకుతున్నా” అన్నాడు పద్మపాదుడు. అడవినంతా ఎఱిగిన ఆ బయన్న తానెన్నడూ అట్టి వింత జంతువును చూడలేదన్నాడు. బయన్న మూఢభక్తుడు. ఉంది అని రూఢిగా చెప్పిన పద్మపాదుని మాటలువిని “సామీ! ఆ ముగము నిజంగా ఉంటే కట్టేసి తెస్తా లేకుంటే పానాలు వదిలేస్తా” అని ఆ నరసింహమును వెదుక బయలుదేరాడు బయన్న!
పద్మపాదుడు వర్ణించిన నృసింహస్వామి అద్భుత రూపాన్ని మనస్సులో ముద్రించుకున్నాడు బయన్న. ఏకాగ్రచిత్తంతో నిద్రాహారాలు మాని అడవంతా తిరిగాడు బయన్న. ఎంత శ్రమించినా అణువణువూ పరీక్షగా చూచినా ఎక్కడా కనబడలేదు స్వామి. “నీవు కనిపించని ప్రాణమెందులకు?” అని బయన్న ప్రాణాత్యాగం చేయబోయాడు. బయన్న నిస్వార్థ నిష్కల్మష మూఢభక్తికి మెచ్చి నృసింహుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే స్వామిని తీగలతో కట్టేసి పద్మపాదుని ముందర నిలబెట్టాడు బయన్న!
కళ్ళముందరే బయన్నకు కనబడుతున్న నృసింహుడు పద్మపాదునకు కనబడలేదు. “స్వామీ! ఏమి నా పాపము?” అని ఆక్రోశించాడు పద్మపాదుడు. “నాయనా! పద్మపాదా! కోటి సంవత్సరములు నా రూపాన్ని ధ్యానం చేసినా అలవడని ఏకాగ్రత భక్తి ఈ బయన్న ఒక్కరోజులో సాధించాడు. ఈ సత్పురుషుని సాంగత్యం వలనే నీకు నా మాటలు వినబడుతున్నాయి. నీవు విచారించకు. నీ అఖండ గురుభక్తికి మెచ్చాను. అవసరమైనప్పుడు నేనే నీకు దర్శనమిచ్చి నిన్ను కాపాడెదను” అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు స్వామి.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో