హైద్రాబాద్, ఆగస్టు 18,
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో స్కూల్స్ రీ ఓపెన్ విషయంలో గందరగోళం నెలకొంది. విద్యార్థులు స్కూళ్లకు రాకపోయినా ప్రభుత్వ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం ఈరోజు నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాల్సి ఉంది. టీచర్లు స్కూల్స్ కు వెళ్లాల్సి ఉండగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ నుండి ఇప్పటివరకు జిల్లా అధికారులకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో టీచర్లు స్కూల్ కి వెళ్లాలా? లేదా? అన్న అంశంపై గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో డిజిటల్ తరగతుల నిర్వహణ కూడా పోస్ట్ పోన్ అయింది. స్కూల్స్ పునఃప్రారంభం విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేయడమే ఇప్పటివరకు స్కూల్స్ రీ ఓపెన్ విషయంలో ఉత్తర్వులు రాకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నెలాఖరు దాకా విద్యాసంస్థలు ఏవీ తెరవద్దని, క్లాసులు నిర్వహించకుండా స్కూళ్లను తెరిస్తే కేంద్ర మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు అవుతుందని సీఎస్ ఉన్నతాధికారులతో చెప్పినట్లుగా సమాచారం.ఈ నెల 11వ తేదీన అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దూరదర్శన్, టీ శాట్ ఛానళ్లలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ డిజిటల్ తరగతుల నిర్వహణ కూడా వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె పేర్కొన్నారు.త్వరలోనే డిజిటల్ తరగతులకు సంబంధించిన తేదీలను మరోమారు ప్రకటిస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. మరోమారు ఈ విషయంపై సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు.ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిజిటల్ తరగతులు, 20వ తేదీ నుండి స్కూల్ విద్యార్థులకు ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు డిజిటల్ తరగతులు , సెప్టెంబర్ 1 నుండి 3 నుండి 5 తరగతుల వారికి డిజిటల్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.మరోపక్క స్కూల్ రీఓపెనింగ్ విషయంలో కూడా క్లారిటీ లేకపోవడంతో టీచర్లు గందరగోళానికి గురవుతున్నారు.స్కూల్స్ పునః ప్రారంభించాల్సిన నేపథ్యంలో సగం మంది టీచర్లు స్కూల్స్ కి రావాలని సూచించారు. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి త్వరలో ఉత్తర్వులు వస్తాయని, టీచర్లందరినీ అలర్ట్ చేయాలని సూచించారు. డిఈవోలు హెడ్మాస్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి టీచర్లు స్కూల్స్ కి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొన్ని చోట్ల ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తాజాగా ప్రభుత్వం ఈ విషయంపై మరో మారు క్లారిటీ ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.