YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వేటగాళ్ల ముప్పు

వేటగాళ్ల ముప్పు

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వన్యప్రాణులు ఉన్నా వాటి రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. మెట్టతో పాటు ఏజెన్సీలో గతంలో భారీ సంఖ్యలో జింకల సంచారం ఉండేది. కాలక్రమంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని పలు జింకలు ప్రాణాలు కోల్పోతున్నాయి. మరికొన్ని శునకాల బారినపడుతున్నాయి.  ప్రధానంగా రంగంపేట-గండేపల్లి మధ్య పొలాల్లో జింకల సంచారం అధికంగా ఉంటోంది. రెండు దశాబ్దాల కిందటి వరకు రంగంపేట, వడిశలేరు, పెదరాయవరం, చండ్రేడు, కోటపాడు గ్రామ పరిసరాల్లోని పొలాల్లో వందల సంఖ్యలో జింకలు మందలుగా సంచరించేవి. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఇవి చెంగుచెంగున గెంతుతూ అందరి దృష్టినీ ఆకర్షించేవి. కాలక్రమంలో వేటగాళ్లు పలు జింకలను హతమార్చడంతో వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మెట్ట ప్రాంతంలో ప్రస్తుతం 30 వరకు జింకలు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

 

మెట్టలో వేసవిలో నీటివనరులు అడుగంటుతుండడం కూడా వీటి సంరక్షణకు ప్రతిబంధకంగా మారింది. జింకలు దాహార్తి తీర్చుకునేందుకు అందుబాటులో నీటి వనరులు లేక పోవడంతో వేసవిలో కొన్ని మృత్యువాతపడుతున్నాయి. మరోవైపు కొన్నిచోట్ల శునకాలు మూకుమ్మడిగా దాడి చేస్తుండడంతో పలు సందర్భాల్లో ఇవి తీవ్రంగా గాయపడడం లేదా మరణించడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శునకాల బారినపడి గాయపడిన జింకలను స్థానిక రైతులు రక్షించి పశువుల ఆసుపత్రుల్లో చికిత్స చేయించిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. నిబంధనల ప్రకారం వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు చిన్నపాటి తొట్టెలను నిర్మించి నీటి వసతి కల్పించాలి. దీనికితోడు వేటగాళ్లు, శునకాల బారి నుంచి వాటిని కాపాడేందుకు వారు చర్యలు చేపట్టాల్సి ఉన్నా వారు అసలు పట్టించుకోవడం లేదు.

గతంలో వన్యప్రాణుల సంచారంతో కళకళలాడిన ఆనూరు మెట్ట ప్రస్తుతం వెలవెలబోతోంది. కొందరు కొండను యథేచ్ఛగా తవ్వేస్తుండడంతో ప్రధానంగా జింకలు చెల్లాచెదురైపోయాయని స్థానికులు చెబుతున్నారు. పెద్దాపురం, గండేపల్లి, రంగంపేట మండలాల పరిసరాల్లో సుమారు 800 ఎకరాల్లో కొండ ఉండగా దానిని దశల వారీగా తవ్వేస్తున్నారు. గతంలో ఈ కొండపై వేటగాళ్లు జింకలను చంపి మాంసాన్ని తొలగించి వాటి శరీర భాగాలను అక్కడే వదిలేసిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితిలో జిల్లాలో వన్యప్రాణుల సంరక్షణకు సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

Related Posts