చెన్నై ఆగష్టు 18
ఏపీ నుంచి తమిళనాడుకు భారీగా తరలించిన గంజాయిని చెన్నై పోలీసులు పట్టుకున్నారు. ఉల్లిపాయల సరుకు రవాణాలో ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని సరఫరా చేశారు. ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. లాక్‌డౌన్ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకోవడం ఇదే తొలిసారి అని చెన్నై నగర పోలీసులు తెలిపారు. ఎం.ఏ.నగర్ ప్రాంతంలో నగర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఏపీలోని గూడురు నుంచి సరుకు రవాణా వాహనం చెన్నైకి వెళ్తుంది. చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపి ప్రశ్నించగా ఉల్లిగడ్డల లోడ్‌గా తెలిపారు. పలు ప్రశ్నలకు అనుమానాస్పదరీతిలో సమాధానమిచ్చారు.దీంతో వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉల్లి సంచుల్లో గంజాయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వాహన యజమాని సైతం లారీని అనుసరిస్తూ ట్యాక్సిలో వస్తున్నాడు. గంజాయితో పాటు నిందితులందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నార్త్ జోన్ అడిషనల్ సీపీ ఏ. అరుణ్ మాట్లాడుతూ... లాక్‌డౌన్ నేపథ్యంలో స్మగ్లర్లు నిత్యావసర వస్తువులు రవాణా చేసే వాహనాల్లో గంజాయిని తరలిస్తున్నారన్నారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకోవడం లాక్‌డౌన్ పిరియడ్‌లో ఇదే తొలిసారి అన్నారు. గత కొన్ని వారాలుగా తనిఖీలను పెంచినట్లు తెలిపారు. నగరంలో గంజాయి అమ్మకాలు లేకుండా చేస్తామన్నారు. పట్టుబడ్డ గంజాయి, దాని విలువ తెలియాల్సి ఉంది.