జిల్లాలో ఎన్టీఆర్ జలసిరి పథకం పక్కదారి పడుతోంది. భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలనుకుంది. జలాశయాల నుంచి నీరు సరఫరా కాని ప్రాంతాల్లో ‘జలసిరి’ బోర్ల ఏర్పాటు ఉత్తమ మార్గంగా భావించింది. దీనికి ఉపాధి హామీ పథకాన్ని ముడిపెట్టారు. సౌరశక్తితో బోర్లు పని చేసేలా ఏర్పాట్లు చేయాలనుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా...బోర్లు తవ్వండని నిపుణులు చెప్పిన చోటే...నీటి చుక్క ఆచూకీ లేకపోవటం గమనార్హం. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పాలకొండ, ఎచ్చెర్ల క్లస్టర్ల పరిధిలోనే సుమారు 60 శాతం బోర్లు విఫలమవతున్నాయి. అప్పటి వరకూ చేసిన కార్యాచరణ ఖర్చుల నిమిత్తం భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యయం చేసినా ప్రయోజనం దక్కటం లేదు.
జిల్లాలో 38 మండలాల నుంచి 7738 మంది రైతులు ‘జలసిరి’ బోర్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2850 మంది అర్హత ధ్రువపత్రాలు పొందారు. 1715 మంది లబ్ధిదారులకు బోర్లు మంజూరయ్యాయి. వారి పొలాలకు భూగర్భ శాస్త్రవేత్తలు వెళ్లి పరిశీలన చేశారు. 1009 చోట్ల బోర్ల తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. ఒక బోరు తవ్వితే ప్రభుత్వానికి రూ.40 వేల వరకు ఖర్చు అవుతుంది. ఆ బోరులో నీటి జాడలు లేకుంటే రూ.20 వేల వరకు వ్యయమవుతుంది. ఇప్పటి వరకు సుమారు 140 చోట్ల తవ్వినా...జలం పడలేదు. అంటే తక్కువగా లెక్కేసుకున్నా దాదాపు రూ.28 లక్షల వరకూ వ్యయం వృథా అయినట్లే.
ఆయా ప్రాంతల్లో నీరు అందుబాటులో ఉన్నదీ, లేనిదీ తేల్చాల్సిన బాధ్యత భూగర్భ శాస్త్రవేత్తలది. వారే స్వయంగా నీరు పడుతుందని దస్త్రాల రూపంలో వివరాలు అందించినా నీరు పడకపోవటంతో ఆ శాఖ వారే విస్తుపోతున్నారు. సాధారణంగా ఒక బోరు తవ్వాలనుకున్న చోట...భూగర్భ శాస్త్రవేత్త చెప్పిన తరువాత కూడా నీరు పడకపోతే ఆ నిపుణుని నుంచి రూ.500 అపరాధ రుసం వసూలు చేస్తారు. అయితే పథకంలో ఇప్పటికే దాదాపు 140కి పైగా బోర్ల వద్ద నీరు పడని నేపథ్యంలో ఏం చేస్తారో చూడాలి.