విజయవాడ ఆగస్టు 19
వైసిపి తప్పుల మీద తప్పులు చేస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఉన్మాదంతో వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళవారం నాడు అయన టిడిపి సీనియర్ నేతలతో ఆన్ లైన్ భేటి అయ్యారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రజా ప్రతినిధులు, అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘టిడిపిపై తప్పుడు ప్రచారంతో వైసిపి అధికారంలోకి వచ్చింది. అదే తప్పుడు ప్రచారాన్ని గత 15నెలలుగా కొనసాగిస్తోంది. వైసిపి తప్పుల మీద తప్పులు చేస్తోంది. ఒక తప్పు నుంచి ప్రజలు తేరుకోకముందే ఇంకో తప్పు చేస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఉన్మాదంతో ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్నింటినీ ధ్వంసం చేస్తోంది. దీనివల్ల వాళ్లకు ఒనగూడే లాభం లేకపోగా సమాజానికి ఎనలేని నష్టం వాటిల్లుతోంది. ఇసుక, భూములు, గనులు, మద్యం.. అన్నింటిలో భారీ కుంభకోణాలు చేస్తున్నారని విమర్శించారు.గోదావరి వరదల ఉధృతికి నిన్న ఆవ భూముల్లో భుజాల దాకా నీళ్లు చేరాయి. పేదలకు ఇళ్ల స్థలాలు ముంపు భూముల్లో ఇస్తారా..? అని ప్రజలే నిలదీస్తున్నారు. ఎకరం రూ5లక్షల భూమిని, రూ50లక్షలకు కొన్నారు. 16అడుగులు లెవలింగ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో దేవుడికే తెలియాలి. సెంటు పట్టా కాదు ఇది, వైసిపి స్కామ్ పట్టా.. భూసేకరణలో అవినీతి, లెవలింగ్ లో అవినీతి, పట్టాకు రూ30వేలు, రూ60వేలు, రూ లక్షా 10వేల చొప్పున వసూళ్లు.. సాక్ష్యాధారాలతో సహా వైసిపి నాయకుల స్కామ్ లు బైటపడినా చర్యలు లేవని అయన అన్నారు. ఏ ఆధారాలు లేకపోయినా అచ్చెన్నాయుడిని, కొల్లు రవీంద్రను జైలుకు పంపారు. కక్షతో కేసుల మీద కేసులు పెట్టి జెసి ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని వేధిస్తున్నారు. టీడిపి నాయకులు, కార్యకర్తలపై దాడులతో పాటు, ఇప్పుడు ప్రజలపై దౌర్జన్యాలకు తెగబడ్డారు. వైద్యులను కూడా దారుణంగా వేధిస్తున్నారు. విశాఖ దళిత వైద్యుడు సుధాకర్ రావుపై దమనకాండ. చిత్తూరు దళిత డాక్టర్ అనితారాణిపై అమానుషం. విజయవాడలో డా రమేష్ బాబుకు వేధింపులు. కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నారు. కరోనా కంటే కుల వైరస్ ఏపి లో ఉధృతంగా ఉందని సినీ నటుడు రామ్ ట్వీట్ చేయడం రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. రామ్ సినిమాలు రాష్ట్రంలో ఆడనివ్వం అని వైసిపి బెదిరించడం హేయమని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు ఇవ్వాలని డిజిపి లేఖ రాయడం విడ్డూరం. ప్రధానికి నేను లేఖ రాస్తే, డిజిపి హుటాహుటిన స్పందించడం విచిత్రం. రాష్ట్రంలో ప్రతిపక్షాల నాయకులపై దాడులు-దౌర్జన్యాలు, తప్పుడు కేసులపై గతంలో ఇచ్చిన వినతులు, రాసిన లేఖలపై డిజిపి ఏం చర్యలు తీసుకున్నారు..? మీరు చేయాల్సింది చేయకుండా, నాకు లేఖలు రాయడం హాస్యాస్పదం. నా విశాఖ పర్యటన అడ్డుకుంటే ఈయన ఏం చేశారు..? ముందు అనుమతి ఇచ్చి, తీరా విశాఖ వెళ్లాక నన్ను ఆపడం ఏమిటి..? గతంలో ఆత్మకూరుకు నన్ను వెళ్లనీకుండా ఇంటి గేట్లకు తాళ్లు కట్టి అడ్డుకున్నారు. కోర్టులో నిలబడి చట్టం చదవాల్సిన పరిస్థితులు డిజిపి ఎందుకు తెచ్చుకున్నారు..? ఇప్పుడు సాక్ష్యాధారాలు ఇవ్వాలని డిజిపి లేఖ రాయడం కన్నా విడ్డూరం మరొకటి లేదని అయన అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వైసిపికి ముందునుంచి ఉన్న అలవాటే..గతంలో సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర వీళ్లది. చివరికి ఇప్పుడు డాక్టర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసే దుస్థితికి వచ్చారు. రోగులు చేసే ఫోన్లను కూడా జవాబివ్వాలంటే వైద్యులు భయపడే స్థితి తెచ్చారు. వీళ్ల వేధింపులు తట్టుకోలేక రోగులకు వైద్యం చేయడానికి కూడా డాక్టర్లు ముందుకు రాని దుస్థితి కల్పించారు. కరోనాతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునే చర్యలు వదిలేసి, వాళ్లను కాపాడే డాక్టర్లపైనే తప్పుడు కేసులు పెట్టి వేధించడం, బెదిరించడం కన్నా నీచం లేదు. వైసిపి నిర్లక్ష్యం కారణంగానే మహారాష్ట్రతో సమానంగా ఏపిలో యాక్టివ్ కేసులు పెరిగాయి. ప్రతి లక్ష జనాభాకు కేసుల సంఖ్యలో ఏపి మొదటి స్థానంలో ఉంది. టాప్ 10డిస్ట్రిక్టులలో 8 ఏపివే.. పాజిటివిటి రేటు 17.2ఉంది, డబ్లింగ్ రేటు 12.8ఉంది. అంటే ఇప్పుడున్న 3లక్షల కేసులు రాబోయే 12.8రోజుల్లో 6లక్షలు కానున్నాయి. కరోనాపై మొదటినుంచి వైసిపి తేలిగ్గా తీసుకోవడమే ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని అన్నారు.
కరోనాలో కూడా వైసిపి రాజకీయ విన్యాసాలు ఆపడం లేదు. రాజధాని తరలింపు ప్రయత్నాలు ఆపడం లేదు. తప్పుడు కేసులు పెట్టడం ఆపలేదు. అవినీతి కుంభకోణాలు ఆపడం లేదు. పేదలను ఆదుకునే చర్యలు చేపట్టకుండా టిడిపి నాయకులపై ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, ఎవరిని అక్రమంగా జైళ్లకు పంపాలా అనేదే ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనకు మన రాష్ట్రం మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ‘‘పోగాలం దాపురించినప్పుడు ఇలాంటి దుర్మార్గాలే చేస్తారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరగని రోజు లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా దళితులపై ఇలాంటి దమన కాండ లేదు. తూర్పు గోదావరి జిల్లాలో దళిత యువకుడి శిరోముండనం, రాజమండ్రిలో మైనర్ దళిత బాలిక గ్యాంగ్ రేప్, గురజాలలో దళిత యువకుడు విక్రమ్ హత్య, దళిత వైద్యులపై దమనకాండ, దళిత జడ్జిపై రాళ్లదాడి, గత 15నెలల్లో 600చోట్ల దళితులపై దాడులు, దౌర్జన్యాలు చేశారు. ఈ రోజు కూడా కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలో దళిత నాయకుడు ధర్మరాజుపై వేటకొడవళ్లతో దాడి చేశారు. దళితులపై వైసిపి దమనకాండను ప్రతిఒక్కరూ గర్హించాలని చంద్రబాబు అన్నారు.