YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వేసవి దందా..

వేసవి దందా..

జిల్లాలో  ఆర్వో వాటర్ ప్లాంట్ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. నిబంధనలు పట్టవు.. అనుమతులుండాలన్నది అస్సలు పట్టదు.. నిబంధనలకు మంగళం పాడుతూ కాసులతో చుట్టేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇంకేముంది నాలుగు బాటిళ్లు.. పది క్యాన్లన్నట్లు వ్యాపారం పరిఢవిల్లుతోంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు తాగే శుద్ధజలం జలమా.. గరళమా అన్న ప్రశ్న ఉత్పన్నం కాకపోగా నిలువరించాల్సిన అధికారరులు మొద్దునిద్రలో జోగుతుండటం విడ్డూరం. మానవ జీవనంలో నీటితో విడలేని బంధం సదరు వనరునే వ్యాపారంగా మలచుకుంటున్న వ్యాపారుల సంఖ్య ఏటికేడు పెరుగుతుందే తప్ప నిబంధనలకు లోబడి సాగకపోవడం అధికారుల డొల్లతనాన్ని చెప్పకనే చెబుతోంది. మొత్తంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ దందా నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.

ఒక్క కరీంనగరంలోనే 200లకు పైగా కేంద్రాలను నిర్వహిస్తుండగా హుజూరాబాద్‌, జమ్మికుంట, గంగాధర, చొప్పదండి, తిమ్మాపూర్‌, మానకొండూరు, శంకరపట్నం ప్రాంతాల్లో సుమారు 500ల వరకు కేంద్రాలున్నాయి. అనుమతి ఉన్న నాలుగు కేంద్రాలు మినహా అన్నింటా నిబంధనలకు మంగళమే.. ప్రజారోగ్యం గాలిలో దీపమే..!  క్యాన్లను నింపేయడం, ఆటోలో తరలించడం ప్రజలకు, ప్రభుత్వ కార్యాలయాలకు అంటగట్టడం దర్జాగా సాగుతోంది. మానవ ఆరోగ్యానికి ప్రమాదమా.. జలం స్వచ్ఛమేనా..అని పరిశీలించే వారే కరవయ్యారు. బోరువేసి మోటారు బిగించి దర్జాగా మినరల్ వాటర్ గా విక్రయిస్తున్నారు. ఇక్కడ బోర్డులేదు.. ఇంటిలో నిర్వహిస్తున్నారు. పరికరాలు ఇలాగైతే నీటి నాణ్యత తెలిసేదెలా?

జిల్లాలో దాదాపుగా 750కి పైగా ఆర్వో ప్లాంట్లు ఉండగా వాటిలో నాలుగంటే నాలుగింటికే అనుమతి ఉంది. మిగతా కేంద్రాలు అనధికారికంగా కొనసాగుతున్నవే. జిల్లావ్యాప్తంగా అనధికారికంగా నిర్వహిస్తున్న వాటర్‌ ప్లాంట్లలో కరీంనగర్‌ నగర పరిధిలో 200ల వరకు ఉన్నాయి. కూల్‌ వాటర్‌, మినరల్‌ వాటర్‌ పేరుతో దందా నిర్వహిస్తున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న వాటర్‌ ప్లాంట్లపై ప్రభుత్వ నియంత్రణ కొరవడింది. నీటిని శుద్ధి చేసేందుకు వినియోగిస్తున్న యంత్రాలకు ప్రభుత్వపరంగా ఎటువంటి గుర్తింపూ లేకపోవడం గమనార్హం. గంటకు 2వేల లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ ప్లాంట్లు నివాస ప్రాంతాల్లో చిన్న చిన్న గదుల్లో నిర్వహిస్తున్నారు. వాటర్‌ ప్లాంట్లలో వినియోగించే పైపులు, నిల్వ చేసే ట్యాంకులు స్టీలువి వినియోగించాల్సి ఉండగా ప్లాస్టిక్‌ వాడుతున్నారు. రోజూ సరఫరా అయ్యే నీటిని తనిఖీలు చేయాల్సి ఉన్నా ఏ ఒక్కచోటా అది జరగడం లేదు. నీటి కోసం మున్సిపల్‌ శాఖ అనుమతి లేకుండానే బోర్లు వేస్తున్నారు. అక్కడ వచ్చిన నీటిని పరీక్షించి దానికనుగుణంగా యంత్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా అలా జరగడం లేదు. ప్లాంట్‌ ఏర్పాటుకు నీటి నిల్వకు కనీసం ఏడు సెంట్ల స్థలం కావాల్సి ఉండగా 200 అడుగుల గదుల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. నీటిలోని ఘన వ్యర్థ పదార్థాలను నామమాత్రంగా శుద్ధిచేసి క్యానుల్లో నింపుతున్నారు. మినరల్‌ వాటర్‌ క్యాన్లు నింపడానికి ప్రత్యేక సదుపాయాలతో గదులు కావాల్సి ఉండగా ఆరుబయట పైపుల ద్వారా నింపుతున్నారు. క్యాన్‌లను వేడి నీటిని ఉపయోగించి ప్రెజర్‌ బ్రష్‌లతో శుద్ధి చేయాల్సి ఉండగా దానిని పూర్తిగా విస్మరించారు. మొత్తంగా ప్లాంట్ల నిర్వాహకులు అనుమతులు లేకుండా నిబంధనలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

మున్సిపల్‌ కుళాయిల్లో వస్తున్న నీటినే క్యాన్లలో నింపి మినరల్‌ వాటర్‌ పేరుతో విక్రయించి సొమ్ముచేసుకునే వారూ ఉన్నారు. సాధారణంగా వాటర్‌ ప్లాంట్‌ను నెలకొల్పాలంటే అందుకు మున్సిపాలిటీల్లో కమిషనర్‌, గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి నుంచి ముందస్తుగా నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ విధిగా పొందాలి. ఎన్‌వోసీ ఆధారంగా ప్లాంటు స్థాపించేందుకు విద్యుత్‌ శాఖ నుంచి కనెక్షన్‌ కోసం అనుమతి పొందాలి. శుద్ధజల కేంద్రాన్ని నిర్వహించాలంటే భారత ప్రమాణాల సంస్థ నిర్ణయించిన నిబంధనల ప్రకారం మైక్రో బయోలజిస్టు, కెమిస్టులు ఉండాలి. శుద్ధి చేసిన నీటిలోని పీహెచ్‌ను పరీక్షిస్తూ ఉండాలి. నీటిలో పూర్తిగా కరిగిన లవణాలను పరీక్షించాలి. పీహెచ్‌ 7.5 శాతం కంటే తగ్గితే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కనీసం 10 గదులు ఉండాలి. ఫిల్లింగ్‌ సెక్షన్‌, ఆర్‌ఓ సిస్టంలో మూడు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రమ్ములు ఏర్పాటు చేయాలి. శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసేందుకు 304 గ్రేడ్‌ స్టెయిలెస్‌ స్టీలు డ్రమ్ములు వాడాలి. ఈ నీటికి తప్పకుండా ఓజోనైజేషన్‌ చేయాలి. మినరల్‌ వాటర్‌ను బబుల్స్‌ (క్యాన్‌)లోకి పట్టే ముందు అల్ట్రావయెలెట్‌ కిరణాలతో శుద్ధి చేయాలి. క్యాన్లను ప్రతిసారి పొటాషియం పర్మాంగనేట్‌ లేదా హైపో సొల్యూషన్‌తో శుభ్రం చేయాలి. వీటిని శుద్ధి చేసిన తేదీ బ్యాచ్‌ నంబర్‌ను సీలుపై ముద్రించాలి. శానిటరీ అధికారుల చేత ప్రతి నెలా నీటిని పరీక్షింపజేసి బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌)కు పంపించాలి.

ఈ విధంగా అనుమతి పొంది స్థాపించిన వాటర్‌ ప్లాంట్‌లో నీటిని శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన యంత్రాలు, వాటి నిర్వహణ, నాణ్యత ప్రమాణాలను ఫుడ్‌ కంట్రోల్‌ శాఖాధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు అనధికారికంగా నడిచే వాటర్‌ ప్లాంట్ల వైపు కన్నెత్తి చూడకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

Related Posts