అమరావతి ఆగష్టు18
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే స్వర్ణ ప్యాలెస్‌లో ప్రమాదం జరిగిందని చెబుతున్నారని, దీనిపై కూడా కొన్ని వార్తలు వచ్చాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోలు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంగణం పోలీస్ పహారాలో ఉందని, లోపల ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను మీడియాకు ఇవ్వాలన్నారు. హోటల్‌లో ఏం జరిగింది తెలుస్తుందన్నారు.హోటల్‌తో అగ్రిమెంట్ అయిన అధికారులను ఎందుకు అరెస్టు చేయలేదని దేవినేని ఉమా ప్రశ్నించారు. అనుమతి ఇచ్చిన యంత్రాంగాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. జిల్లా యంత్రాంగమే ఆ హోటల్‌ను రమేష్ ఆస్పత్రికి ఇచ్చిందని, ఆ అధికారులే ఇప్పుడు విచారణ చేస్తున్నారని.. దీనిబట్టి చూస్తే న్యాయం ఎలా జరుగుతుందని, వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. కుట్రదారులు శిక్షించబడాలని, చనిపోయిన వారి ఆత్మ శాంతించాలన్నారు. ప్రాణాలు కాపాడుకోడానికి వచ్చి మృతి చెందారని విచారం వ్యక్తం చేశారు.