కర్నూలు, ఆగస్టు 19,
మూడు రాజధానుల వ్యవహారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమ జిల్లాల్లో దీనిపై వ్యతిరేకంగా గళం విన్పిస్తున్న వారెవ్వరూ కన్పించడం లేదు. దీంతో రెండు ప్రాంతాల్లో ఇద్దరిని చంద్రబాబు ఎంచుకున్నారని తెలుస్తోంది. రాయలసీమ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (సీమ కాకపోయినా), ఉత్తరాంధ్ర నుంచి సబ్బం హరిని చంద్రబాబు ఎంపిక చేసుకున్నారనిపిస్తోంది. వారి వాయిస్ మాత్రమే మూడు రాజధానులకు వ్యతిరేకంగా వినపడుతుంది.తొలి నుంచి చంద్రబాబు మూడు రాజధానులకు వ్యతిరేకంగానే ఉన్నారు. అమరావతిలోనే కొనసాగాలన్నది చంద్రబాబు నినాదం. అయితే జగన్ మూడు రాజధానుల ప్రకటన చేయడంతో ప్రజల్లో కొంత మార్పు కన్పిస్తుంది. తమ ప్రాంతం కొంత మేర అభివృద్ధి చెందుతుందన్న ఆశ ఆ ప్రాంత ప్రజల్లో స్పష్టంగా కన్పిస్తుంది. దీంతో రాయలసీమకు హైకోర్టు, ఉత్తరాంధ్రకు పరిపాలన రాజధానిని ఆ ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగానే స్వాగతిస్తున్నారు.ఉత్తరాంధ్రలో టీడీపీకి అనేకమంది నేతలు ఉన్నా ఎవరూ పెదవి విప్పడం లేదు. రాజధాని విషయంలో మాట్లాడకుండా ఉండటమే బెటరన్నది వారి ఆలోచనగా ఉంది. అందుకే మూడు రాజధానులకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఉత్తరాంధ్రలో పెద్దగా స్పందన రాలేదు. విశాఖలోనే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. శ్రీకాకుళంలో ఎంపీ ఉన్నారు. కానీ వీళ్లెవ్వరూ రాజధాని పై స్పందించకపోవడంతో ఆ బాధ్యతను సీనియర్ నేత సబ్బం హరికి అప్పగించారు చంద్రబాబు. అందుకే సబ్బం హరి విశాఖకు రాజధాని అవసరం లేదని, అమరావతిలోనే కొనసాగించాలని నిత్యం టీడీపీ అనుకూల మీడియాలో చెబుతున్నారు.ఇక రాయలసీమలోనూ అనేక మంది సీనియర్ నేతలున్నారు. రాయలసీమ మొత్తానికి ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారు. ఉన్న పయ్యావుల కేశవ్ రాజధానిపై ఏమీ మాట్లాడటం లేదు. బాలయ్య సంగతి సరేసరి. పయ్యావుల కేశవ్ కు రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నాయని కమిటీ తేల్చడంతో రాజధాని అంశంపై ఆయన పెదవి విప్పేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఈ బాధ్యతలను నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చంద్రబాబు అప్పగించినట్లు తెలుస్తోంది. సీమ వాయిస్ ను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారానే వినపడుతుంది. మొత్తం మీద మూడు రాజధానుల అంశంలో కీలక నేతలు ఎవరూ స్పందించకపోవడం పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది.