అనంతపురం, ఆగస్టు 19,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కాలం కలసి రావడం లేదు. అన్నీ రివర్స్ లో కొడుతున్నాయి. ఇలా ప్రధాని మోదీని ప్రశంసిస్తూ లేఖ రాశారో లేదో? బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రబాబును టార్గెట్ చేయడం పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు లేఖకు ఎలాంటి స్పందన ఉండదని దీనిని బట్టే స్పష్టమవుతుంది. చంద్రబాబును బీజేపీ దగ్గరకు తీసుకునే అవకాశాలే లేవని స్పష్టమయిందిచంద్రబాబు రాసిన లేఖలో కూడా స్పష్టత లేదంటున్నారు బీజేపీ నేతలు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని లేఖలో ప్రస్తావించారు తప్ప, ఎవరి ఫోన్ లు ట్యాప్ అయ్యాయో చెప్పలేదు. అలాగే బీజేపీ నేతలు మరో సవాల్ విసురుతున్నారు. ఓటు కు నోటు కేసులో కూడా ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలా? ఇందుకు చంద్రబాబు అంగీకరిస్తారా? అన్న విషయాలను కూడా బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు.ఏపీ బీజేపీ ఇదివరకటిది కాదన్నది స్పష్టమయింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జనసేన పవన్ కల్యాణ‌్ కూడా ఎలాంటి స్పందనలేదు. అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అధికార వైసీపీ చెబుతోంది. ఆధారాలుంటే బయటపెట్టాలని స్వయంగా హోంమంత్రి ప్రకటించారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చంద్రబాబు తొందరపడ్డారని, ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రధానికి లేఖ రాయడం నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తగదని బీజేపీ నేతలు సూచిస్తున్నారుమరోవైపు చంద్రబాబు గతంలో తమకు చేసిన ద్రోహాన్ని కూడా ఈ సందర్భంగా బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 1998, 1999, 2004, 2014 ఎన్నికల్లో తమకు చంద్రబాబుతో దొరికిన అనుభవాన్ని కూడా బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. తమ పార్టీ ఎదగనీయకుండా చంద్రబాబు గత కొన్నేళ్లుగా అడ్డుకోవడాన్ని కూడా బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇక చంద్రబాబు ట్రాప్ లో తాము పడేది లేదని బీజేపీ నేతలు చెబుతుండటంతో ఆయన రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించే అవకాశం లేదని ఇట్టే అర్ధమవుతుంది. మరి చంద్రబాబు బీజేపీ సయోద్యకు చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.