కడప, ఆగస్టు 19,
ఒక్కోసారి అంతే. రాజకీయాల్లో ఎంత ఎదిగినా బ్యాడ్ టైమ్ వచ్చిందంటే ఇక కెరీర్ ముగిసినట్లే. రాష్ట్ర విభజనతో అనేక మంది నేతలు రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. వారు దూరమయ్యారయ్యారనే కంటే వారినే ప్రజలు పక్కన పెట్టారు. ఇక అన్ని పార్టీల్లోకి యువతరం పరుగులు పెడుతోంది. దీంతో సీనియర్ నేతల సీన్ ముగిసిందనే చెప్పాలి. అలాంటి సీనియర్ నేతల్లో ఒకరు డీఎల్ రవీంద్రారెడ్డి. ఆయన రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనని చెప్పుకోవాలి.డీఎల్ రవీంద్రారెడ్డి 2014 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడంతో ఆయన పార్టీలో ఉన్నా లేనట్లే వ్యవహరించారు. ఇంటికే పరిమితమయ్యారు. కడప జిల్లాలో డీఎల్ రవీంద్రారెడ్డి సీనియర్ నేత. ఆరుసార్లు మైదుకూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించి చరిత్ర సృష్టించారు. 2014, 2019 ఎన్నికల్లో డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ చేయలేదు. ఆయన పోటీ చేయలేదు అనేకంటే ఆయనకు ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదనడం సబబుగా ఉంటుందేమో.
2019 ఎన్నికల్లో డీఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలని భావించారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబును కూడా కలిశారు. అయితే చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీలో చేరలేదు. తన అనుచరులతో సమావేశమైన డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు. డీఎల్ రవీంద్రారెడ్డిని అప్పట్లో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాష్ రెడ్డిలు కలసి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు మాత్రం డీఎల్ రవీంద్రారెడ్డి వర్గం అప్పట్లో ప్రచారం చేసుకుంది.కానీ జగన్ ప్రస్తుతం రెడ్డి సామాజికవర్గాన్ని పదవులకు దూరంగా ఉంచుతున్నారు. దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ పోస్టులు సయితం ఎస్సీ, మైనారిటీ, బీసీ వర్గాలకే ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు వైసీపీలో డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి నేతలను పట్టించుకునే తీరికా ఎవరికీ లేదు. పైగా ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే సైలెంట్ అయిపోయారు. ముఖ్యమంత్రి జగన్ ను కలసే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. దీంతో రాజకీయాల నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి తనంతట తానుగా తప్పుకున్నట్లే నని చెబుతున్నారు.