నెల్లూరు, ఆగస్టు 19,
ఒక్క వైరస్ ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇవాళ్టి నుంచి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం షార్‌లో పూర్తిగా లాక్ డౌన్ అమలు చేయనున్నారు. ఘన ఇంధన విభాగంలో పనిచేసే ఉద్యోగులు పలువురికి కరోనా పాజిటివ్ సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కోవిడ్ ప్రభావంతో శ్రీహరికోటలో ఇస్రో కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది.సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డీఎస్‌సీ-షార్)లో కార్యకలాపాలకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నిబంధనల ప్రకారం ప్రతి రోజూ జరిగే అన్ని రకాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. షార్ కంట్రోలర్ వీ కుంభకర్ణన్ జారీ చేసిన ఓ సర్క్యులర్‌లో తెలిపిన వివరాల ప్రకారం, షార్‌లోనూ, సూళ్ళూరు పేట గృహ నిర్మాణ సముదాయాల్లోనూ కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. దీంతో ఈ వైరస్ సోకినవారిని, వారికి సమీపంలో సంచరించినవారిని గుర్తించవలసిన అవసరం ఏర్పడింది. కరోనా వైరస్ సోకిన వారితో కలిసి తిరిగిన వారిని గుర్తించి, ప్రత్యేకంగా చికిత్స అందజేయవలసి ఉంది. ఈ వ్యాధి మరింత విస్తరించకుండా ముందు జాగ్రత్త కోసం కార్యాలయ ప్రాంగణాల్లో ఫ్యుమిగేషన్, శానిటైజేషన్ చేయించవలసి ఉంది. ఈ చర్యల కోసం షార్ కార్యకలాపాలన్నిటినీ తాత్కాలికంగా నిలిపేయాలని నిర్ణయించామన్నారు. రాకెట్ లాంచ్ స్టేషన్‌లో ముఖ్యమైన కార్యకలాపాలను నిర్వహించేందుకు అతి తక్కువ మంది సిబ్బంది మాత్రమే పని చేస్తారని ఈ సర్క్యులర్ పేర్కొంది. అత్యవసర సేవల విభాగం మినహా మిగిలిన ఉద్యోగులంతా ఇళ్ల వద్ద నుంచే పని చేయాలని పేర్కొంది. పులికాట్ నగర్ ఎంప్లాయీస్ కాలనీలో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అష్ట దిగ్బంధనం విధించారు. ఉద్యోగులు స్వీయనిర్బంధంతో కరోనా వ్యాప్తి నిరోధానికి సహకరించాలని అధికారులు కోరారు.