YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

చైనాకు తప్పని ఆహార సంక్షోభం

చైనాకు తప్పని ఆహార సంక్షోభం

బీజింగ్, ఆగస్టు 19, 
భారత దేశ సార్వభౌమాధికారానికి సవాల్‌ విసురుతోన్న శక్తులకు భారత సాయుధ దళాలు తగు రీతిలో బుద్ధిచెప్పాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చైనా అత్యంత వ్యూహాత్మకంగా స్పందించింది. ఆసియాలోనే అతి పెద్ద దేశాలైన చైనా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి, విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి, పరస్పర రాజకీయ విశ్వాసాలను అభివృద్ధి చేసుకొనేందుకు భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది.
ఎర్రకోటపై నుంచి 74వ స్వాతంత్య్రదినోత్సవ సందేశాన్నిస్తూ ఎల్‌ఓసీ నుంచి ఎల్‌ఏసీ వరకు మా దేశంపై సవాల్‌ విసురుతోన్న వారికి బుద్ధి చెప్పామని పాకిస్తాన్, చైనాలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. తూర్పు లద్ధాఖ్‌  సరిహద్దు ప్రాంతంలో చైనాతో ఉన్న ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని, పాకిస్తాన్‌ పదే పదే కాల్పుల విరమణని అతిక్రమిస్తూ ఉండడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ విభేదాల పరిష్కారం కోసం ముందుకు కదులుదాం అంటూ పిలుపునిచ్చారు.
‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసాన్ని మేము గమనించాం. మేం ఇరుగుపొరుగు దేశాల వాళ్ళం. ఒక్కో దేశంలో వందకోట్లకుపైగా జనాభాతో అభివృద్ధి చెందుతోన్న దేశాలు మావి. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలకే కాకుండా, ఈ ప్రాంతపు శాంతి, అభివృద్ధి, స్థిరత్వం యావత్‌ ప్రపంచానికే మేలు చేస్తుంద''ని ఝావో అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా, ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడం, సహకరించు కోవడం, సరైన మార్గమని ఝావో ఈ సందర్భంగా అన్నారు.
60 ఏళ్లలో తొలిసారిగా చైనాలో ఆహార సంక్షోభం.. కరువుఛాయలతో గగ్గోలు  ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారాలని ఉవ్విళ్లూరుతున్న చైనాలో ఆకలి కేకలు చోటుచేసుకుంటున్నానాయా? చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ స్వయంగా క్లీన్ ప్లేట్ పేరిట ఒక ఉద్యమం ప్రారంభించడంతో చైనాలో ఆహార సంక్షోభ ఛాయలు నిజంగానే కనిపిస్తున్నాయని ప్రపంచం భావిస్తోంది. అయితే వాస్తవానికి ఇప్పటికిప్పుడు ఆహార కొరత లేకపోయినప్పటికీ- భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు తప్పవని ముందే గ్రహించిన కమ్యూనిస్ట్‌ నాయకత్వం ఈ క్లీన్ ప్లేట్ ఉద్యమాన్ని ఆరంభించింది.  
ఈ ఆహార భద్రత ఉద్యమం 2013లోనే తొలిసారిగా- ఆపరేషన్‌ ఎమ్టీ ప్లేట్‌ పేరిట  మొదలైంది. దానికి కొనసాగింపుగా అన్నట్లు ఇపుడు ఆపరేషన్‌ క్లీన్‌ ప్లేట్‌ -2.0ను మొదలెట్టారు. పైకి చెప్పకపోయినా.. దాదాపు ఆరు నుంచి 9 రాష్ట్రాల్లో కరువు ఛాయలు, కొన్ని చోట్ల వరదలతో భారీగా దిగుబడి తగ్గిపోవడం, కొవిడ్‌ కారణంగా భారత్‌ సహా అనేక దేశాల నుంచి దిగుమతులూ లేకపోవడంతో ఈ క్లీన్‌ ప్లేట్‌ ఉద్యమం మొదలెట్టింది. ప్రధాన నగరాల్లో జరిపిన క్షేత్రస్థాయి అధ్యయనం ప్రకారం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఏటా కనీసం 1800 కోట్ల కిలోల ఆహార వృథా జరుగుతోంది. ఇది కనీసం 5 కోట్ల మంది ఆకలిని తీర్చగలదు.
కొవిడ్‌ కేవలం వుహాన్‌ నగరానికి మాత్రమే పరిమితమైనప్పటికీ దీని ప్రభావం దేశమంతా కనిపిస్తోంది. అనేక రాష్ట్రాల్లో రైతులు తమ పంటను  గొడౌన్లకు తరలించడానికి విముఖత చూపారు. కారణం... దేశవ్యాప్తంగా ఆహార దినుసుల ధరలు పెరగడం. దీంతో సగం గోడౌన్లు ఖాళీగా మిగిలాయి. చైనాలో ఆహార వృథా రాజ్యాంగం ప్రకారం తప్పిదం. అయితే వృథా కేవలం ప్రజలు తినే సమయంలోనే కాక- ఉత్పత్తి, నిల్వ, రవాణా, వినియోగ సమయాల్లోనూ జరుగుతోందని, అందువల్ల చట్టానికి మరిన్ని కోరలు చేరుస్తామని నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సభా వ్యవహారాల కమిటీ సభ్యుడు జాంగ్‌ గిలాంగ్‌ చెప్పారు.
చైనా ఎక్కువగా గోధుమ, వరి, మొక్కజొన్న పండిస్తుంది. అయితే ఈసారి వరదల వల్ల గోధుమ దిగుబడి కనీసం 14-20 శాతం తగ్గింది. అధికారిక లెక్కల ప్రకారం లక్షల హెక్టార్లలో పంట మునిగిపోవడం వల్ల దిగుబడి ఈ ఏడాది కనీసం 11.2 మిలియన్‌ టన్నుల మేర పడిపోనుంది. గతంతో పోల్చితే 2 శాతం తక్కువ. పదేళ్లలో తొలిసారి గోధుమలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది జూలై వరకు 74.51 మిలియన్‌ టన్నుల గోధుమను దిగుమతి చేసుకున్నట్లు చైనా కస్టమ్స్‌ శాఖ వివరించింది. 60 ఏళ్ల కిందట- 1959లో అప్పటి చైనా అధినేత మావో జెడాంగ్‌ దేశప్రజలందరికీ ఓ పిలుపునిచ్చారు. భయంకరమైన దుర్భిక్షం దేశాన్ని కమ్ముకోవడంతో- ‘ప్రజలంతా తక్కువగా తినాలని, ఖాళీ సమయాలో ఏదో ఒకటి తినడం ఆపేయాలని’ ఆయన కోరారు. ఆహార పదార్థాల రేషనింగ్‌ కూడా చేశారు. అంతస్థాయిలో కాకపోయినా ఇపుడు కూడా చైనా ‘ఆహార వృథాను’ తగ్గించాలని దేశప్రజలకు పిలుపనిచ్చింది.
పొరుగుదేశాలతో చీటికీ మాటికీ కయ్యం పెంచుకుంటే ఫలితం అఢ్డం తిరుగుతుందన్న జ్ఞానోదయం చైనాకు లేటుగా వెలిగినట్లు కనిపిస్తోంది. ఆరు నెలలు ఇతర దేశాలనుంచి దిగుమతులు ఆగిపోగానే చైనా ఇంతటి సంక్షోభం ఎదుర్కొంటోదంటే కోవిడ్-19 మరికొన్ని నెలలు కొనసాగితే ఆహార ధాన్యాల సరఫరా స్తంభించిపోయే ప్రమాదం ఉందని చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకత్వం భీతిల్లుతోంది.

Related Posts