వికారాబాద్ ఆగస్టు 18,
వికారాబాద్ రాజీవ్ గృహకల్ప లో భర్త వరకట్న వేధింపులతో భార్య ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త పై కేసు నమోదు చేసారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం, దుర్గం చెరువు గ్రామానికి చెందిన గడ్డ సంజీవులు సంతోష దంపతుల పెద్ద కుమార్తె బబితను మూడు సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లా, కుంచారం మండలం, కుంచారం గ్రామానికి చెందిన తలారి జనార్ధన్, నర్సమ్మ దంపతుల కుమారుడు తలారి ఆనందం కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి అయిన తరువాత ఒక సంవత్సరం వారి సంసారం సజావుగా సాగింది. భార్యాభర్తలు కలిసిమెలిసి ఉన్నారు. ఆ తర్వాత కుటుంబ కలహాలు ప్రారంభమయ్యాయి. వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయి. మధ్య మధ్యలో కొన్ని సందర్భాలలో గొడవ పడడంతో తల్లిగారింటికి బబితా వెళ్లిపోవడం జరిగింది . తల్లిదండ్రులు నచ్చజెప్పి కలిసిమెలిసి ఉండాలని మళ్లీ అత్తగారింటికి భర్త దగ్గరకు పంపించారు. గత నెలలో తీవ్రస్థాయిలో వేధించడంతో తిరిగి తల్లి ఇంటికి వెళ్ళిపోయింది బబిత. మూడు రోజుల క్రితం భబిత తల్లిదండ్రులు సంజీవులు సంతోష ఇరువురికి నచ్చజెప్పి భర్త వద్దకు పంపించారు. బుధవారం మధ్యాహ్నం వికారాబాద్ రాజీవ్ గృహకల్ప లో వుంటున్న అద్దె ఇంటిలో వారిద్దరూ మళ్లీ గొడవ పడ్డారు. భర్త వేధింపులు తాళలేక ఆత్మ స్థైర్యం కోల్పోయి బెడ్ రూం లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఆత్మహత్య చేసుకున్న భబితను భర్త ఆనంద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తానే స్వయంగా వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. ఆ తర్వాత పక్కింటి వారు మృతి చెందిన మహిళ యొక్క తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ తర్వాత మృతురాలి తల్లిదండ్రులు వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భర్త వేధింపులకు వరకట్న వేధింపులకు మాత్రమే ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే వికారాబాద్ డిఎస్పి సంజీవరావు, వికారాబాద్ సిఐ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.