ప్రకాశం ఆగస్టు 19
వైసీపీలో ఆధిపత్యపోరు పతాక స్థాయికి చేరింది. టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వర్సెస్.. వైసీపీనే నమ్ముకొని ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నారు. వైసీపీలో చేరినా టీడీపీ వారినే ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఆధిపత్య పోరు సెగలు కక్కుతోంది. నియోజకవర్గ నేతలంతా కలిసి తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ పై ఫిర్యాదు చేశారు. దర్శిలో అభివృద్ధి పనుల నుంచి అధికారుల నియామకం వరకు టీడీపీ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్న ఎమ్మెల్యే వేణుగోపాల్ పై మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గం నేతలు వైవీకి విన్నవించారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి ఒకే సామాజికవర్గానికే ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు.ఆది నుంచి వైసీపీలో ఉన్నవారికి దర్శిలో పదవులు కాంట్రాక్టులు దక్కడం లేదని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి వర్గం అధిష్టానానికి చెప్పుకొచ్చింది. ప్రధానంగా ఆదాయం ఒనగూరే పనులన్నీ టీడీపీ వారికే కట్టబెడుతున్నారని.. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన తమను విస్మరిస్తున్నారని వారు గోడు వెల్లబోసుకున్నారు. దీంతో వైవీసుబ్బారెడ్డి వారందరికీ హామీనిచ్చి.. పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం జరగనివ్వనని ధైర్యం చెప్పారని తెలిసింది.కాగా వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఎమ్మెల్యే వేణుగోపాల్ వర్గం సమావేశమైంది. పాలనపై పట్టు ఆదాయ వనరులను వశం చేసుకునేందుకునేందుకే తమపై ఫిర్యాదు చేశారు కావచ్చని నేతలు అభిప్రాయపడ్డారట.. దీంతో ఎమ్మెల్యే వేణుగోపాల్ సైతం నిజానిజాలను అధిష్టానానికి వివరిస్తానని బయలు దేరినట్లు తెలుస్తోంది.