YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పర్యావరణాన్ని పరిరక్షించండి -మంత్రి తలసాని

పర్యావరణాన్ని పరిరక్షించండి -మంత్రి తలసాని

హైదరాబాద్ ఆగస్టు 19 
ఈ నెల 22 వ తేదీ నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల సందర్బంగా ప్రజలు తమ ఇండ్లలో మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మంత్రి  శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, ఉప్పల తరుణీ, హేమలత లకు మట్టి వినాయకుడి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ చర్యలలో భాగంగా రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, స్వాతి ప్రమోటర్స్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ  పరిధిలో లక్ష మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విగ్రహాలు కావాల్సిన వారు మీ ప్రాంత కార్పొరేటర్ లను సంప్రదించాలని సూచించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో స్వాతి ప్రమోటర్స్ ఆధ్వర్యంలో 10 వేల విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ మట్టి విగ్రహాలను కార్పోరేటర్ల ద్వారా ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న నేపద్యంలో గణేష్ ఉత్సవాలను ఇండ్లలోనే జరుపుకొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సాంప్రదాయాలను గౌరవిస్తుందని, కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలను ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుందని ఆయన వివరించారు. దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని గణేష్ దేవాలయాలలో ఉత్సవాలను సాంప్రదాయబద్దంగా నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యలలో భాగంగానే ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలను ఎలాంటి ఆడంబరం లేకుండానే నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే సంవత్సరం బోనాలు, గణేష్ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.

Related Posts