విజయవాడ, ఆగస్టు 20,
పెళ్ళికి పిలిస్తే ఉత్త చేతులతో ఎవరూ వెళ్లరు, అలాగే శుభకార్యానికి పిలిచి పెద్ద పీట వేశారని సంబరం కాదు, అక్కడకు ఉత్త చేతులతో వెళ్లకుండా ఏదో ఒకటి ఇచ్చి రావాలి కూడా. అయిదేళ్ల క్రితం అమరావతి రాజధాని శంఖుస్థాపనకు మట్టి, నీళ్లతో మోడీ వచ్చారని ఇప్పటికీ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తారు. బహుశా దాన్ని దృష్టిలో ఉంచుకునే కాబోలు మోడీకి గట్టిగా బిగించేలా వైసీపీ పెద్దలు డిమాండ్లు రెడీ చేసి పెట్టారు. విశాఖలో అక్టోబర్ 25న విజయదశమి వేళ కొత్త రాజధానికి శంఖుస్థాపన చేయడానికి జగన్ సర్కార్ సర్వం సిధ్ధం చేస్తోంది. ఆ వేళకు న్యాయపరమైన అడ్డంకులు కూడా లేకుండా ఉంటాయని అంచనా వేస్తోంది.జగన్ విశాఖ రాజధానితో పాటు మొత్తం మూడు చోట్ల నిర్మాణాలు తలపెట్టారు. దాంతో ఈ అంచనాలు అన్నీ వేసుకున్నమీదట 60,123 కోట్ల రూపాయలను కేంద్రం రాజధాని నగర నిర్మాణాల కోసం డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల మూడు ప్రాంతాల్లో సమానమైన అభివృధ్ది జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. విభజన తరువాత ఏపీ ఏ విధంగానూ ఆర్ధికంగా బతికి బట్టకట్టలేని స్థితిలో ఉందని కూడా వైసీపీ సర్కార్ తన బాధలను కేంద్రానికి వివరిస్తోంది. దాదాపు లక్ష కోట్ల అప్పుతో ఏపీగా విడిపోయిన తరువాత అయిదేళ్ళ కాలంలో మూడు లక్షల కోట్ల మేర అప్పులతో ఏపీ ఉందని, ఇక కరోనా వంటి విపత్తులతో మరింతగా దిగజారిందని కూడా కేంద్రం ద్రుష్టికి తెస్తోంది.రాజధాని నిర్మాణానికి నిధులు కాకుండా రానున్న అయిదేళ్ల కాలంలో ఏపీ అభివృధ్ధికి ఉదారంగా నిధులు ఇచ్చి ఆదుకోవాలని 15వ ఆర్ధిక సంఘానికి వైసీపీ సర్కార్ పూర్తి వివరాలతో లేఖను రాసింది. ఏపీ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆర్ధికంగా బాగా వెనకబడిపోయిందని కూడా అందులో గుర్తు చేశారు. ఏపీకి నిధులు ఏడాదికి రెందు లక్షల కోట్ల వంతున ఇచ్చి ఆదుకోకపోతే మరింతగా ఇబ్బందులు వస్తాయని కూడా జగన్ సర్కార్ వివరించింది. అంటే ఏకంగా పది లక్షల కోట్లకే జగన్ కేంద్రానికి టెండర్ పెట్టేసింది.ఇదిలా ఉండగా విశాఖ రాజధాని శంఖుస్థాపనకు మోడీతో సహా దేశంలోని ముఖ్యమంత్రులందరికీ పిలుస్తామని మంత్రి బొత్స సత్యనరాయణ ఈసరికే చెప్పేశారు. అంటే ఏ మాత్రం అమరావతి రాజధానికి తీసిపోకుండా విశాఖను కూడా హైలెట్ చేస్తూ ఘనంగానే ఈ కార్యక్రమం నిర్వహించాలని జగన్ డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఇక ప్రధాని హోదాలో మోడీని పిలవడం వెనక రాజకీయమే కాదు, ఆర్ధిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అందుకే రెండు నెలలు ముందుగానే ఏపీ ఆర్ధిక పరిస్థితిని వివరిస్తూ ఆర్ధిక సంఘానికి వైసీపీ సర్కార్ లేఖలు రాసిందని చెబుతున్నారు. దీంతో మోడీ వచ్చినా ఉత్త చేతులతో కాకుండా దండీగా నిధులు తేవాల్సి ఉంటుంది. మరి జగన్ సర్కార్ వేసిన ఈ వ్యూహానికి మోడీ జవాబు ఎలా ఉంటుందో చూడాలి