విశాఖపట్టణం, ఆగస్టు 20,
రాష్ట్రంలో కీలకమైన పరిణామం.. విశాఖపట్నంలో చోటు చేసుకుంటోందని అంటున్నారు పరిశీలకులు. పాలనా రాజధానిని విశాఖకు తరలిస్తానని చెప్పిన సీఎం జగన్.. ఆదిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. వాటిని అధిగమించి.. రాజధానిని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మరి వైజాగ్‌లో రాజకీయం అధికార పార్టీకి ఎలా ఉంటుంది ? ఇక్కడ ఇప్పటికే ఉన్న వైసీపీ నేతల పరిస్థితి ఏంటి ? అనే విషయాలు చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మంత్రి అవంతి శ్రీనివాసరావు.. చక్రం తిప్పేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు.కానీ, రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న మొన్నటి వరకు కూడా అన్నీతానై ఉత్తరాంధ్ర జిల్లాల్లో చక్రం తిప్పారు. పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి కూడా ఆయన విశాఖలోనే మకాం వేశారు. ఇక్కడ తను చెప్పిందే వేదం అనే రేంజ్‌లో పార్టీని ముందుకు నడిపించారు. ఫలితంగా ఇక్కడ నాయకులు అంటూ ఎవరూ ప్రత్యేకంగా లేకుండా పోయారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మంత్రి అవంతి శ్రీనివాస్ వంటి వారు ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. విజయసాయిరెడ్డి హవాతో వారంతా డమ్మీలుగానే ఉన్నారు. కానీ, పక్కనే ఉన్న కాకినాడలో కన్నబాబు, విజయనగరంలో బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళంలో స్పీకర్ తమ్మినేని వంటి వారు దూకుడుగా ఉన్నారు.కానీ, విశాఖను చూస్తే.. మాత్రం నిన్న మొన్నటి వరకు సాయిరెడ్డి మాత్రమే చక్రం తిప్పారు. ఒకానొక దశలో ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న విజయసాయిరెడ్డి విశాఖ రాజకీయాలను అన్నింటిని తానై పూర్తిగా నడిపిస్తుండడంతో ఇక్కడ వైసీపీ నేతలు అందరూ చేష్టలుడిగి చూస్తుండడం తప్ప చేసేదేమి లేకుండా పోయింది. ఈ విషయంలో విజయసాయిపై మంత్రి అవంతితో పాటు విశాఖ ఎమ్మెల్యేలు లోలోన తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారన్న వార్తలు కూడా నిన్న మొన్నటి వరకు విశాఖ పార్టీ వర్గాల్లోనే వినిపించాయి. పోనీ.. ఇప్పుడు ఇక్కడ నేతలు ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నా.. త్వరలోనే ఇక్కడ రాజధాని రానుండటంతో మరింతగా వీరి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. రాజధాని వస్తే.. సీఎం జగన్ ఇక్కడే ఉంటారు. అన్ని ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి.జగనే ఇక్కడ నివాసం ఏర్పరుచుకుంటే అప్పుడు ఆయన చుట్టూనే రాజకీయాలు ఫోకస్ అవుతుంటాయి. పైగా పోలీసులు, రెవెన్యూ వంటి కీలక శాఖలు కూడా ఇక్కడకు వచ్చేస్తే.. అధికారుల హవా కూడా పెరుగుతుంది. దీంతో వీరు ఇక్కడ చక్రం తిప్పే పరిస్థితి ఉండదు. ఇవన్నీ ఇలా ఉంటే.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వంటివారు పార్టీలోకి వస్తే.. ఇక, ఆయన చుట్టూతూనే రాజకీయాలు నడుస్తాయని అంటున్నారు. మొత్తానికి విశాఖకు రాజధాని మాటేమో.. కానీ, స్థానిక నేతల హవాకు మాత్రం బ్రేకులు పడతాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుంందో చూడాలి.