హైద్రబాద్, ఆగస్టు 20,
తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డుకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం ఆక్రమణ దారుల జేబుల్లోకి వెళుతోంది. వివిధ దర్గాలకు చెందిన షాపుల అద్దెను స్థానిక ఆక్రమణదారులు యధేచ్ఛగా అనుభవిస్తుంటే బోర్డు అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అద్దె వసూళ్ళకు వక్ఫ్ అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయక పోవడం గమనార్హం. అధికారుల నిర్లక్షం కోట్లాది రూపాయల ఆదాయానికి ఎసరు పెడుతోంది. విలువైన వక్ఫ్ ఆస్తులను రాబందుల్లా కబ్జాదారులు అనుభవిస్తున్నారని పలు మైనారిటీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల్లో వక్ఫ్ సంస్థలకు సంబంధించి అనేక దుకాణాల సముదాయాలు ఉన్నాయి. వాటిని ఏళ్ళ క్రితమే అద్దెకిచ్చారు.కొన్ని చోట్ల మినహా చాలా చోట్ల నుండి అద్దెలు వసూలూ కావడం లేదు. కొన్ని చోట్ల అద్దె వసూలు అవుతున్నా అది నామమాత్రంగా ఉండడంతో వక్ఫ్‌బోర్డు కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతోంది. ఆయా ప్రాంతాల్లో స్థానిక నేతలు కొందరు రాజకీయ అండదండలతో దుకాణాలను తమ అధీనంలో పెట్టుకొని అద్దె వసూలు చేసి జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇది అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న తంతుగా మారింది. అద్దె రాబట్టడానికి బోర్డు అధికారులు మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.అధికార వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లోని విలువైన వక్ఫ్ సంస్థల నుండి అద్దె రావడం లేదు. పాతబస్తీలోని మదీనా బిల్డింగ్‌కు సంబంధించి 10కి పైగా షాపులు ఉన్నా ఇందులో ఒకరిద్దరు మాత్రమే అద్దె చెల్లిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పత్తర్‌గట్టిలోని నబి ఖానా మౌల్విపరిధిలో 300కు పైగా షాపులున్నాయి. నెలకు రూ.200 నుండి రూ.250 వరకు మాత్రమే దుకాణాదారులు అద్దె చెల్లిస్తున్నారు. దీంతో బోర్డుకు రావాల్సిన ఆదాయం రావడం లేదు. ఈ షాపులను తమ ఆధీనంలో పెట్టుకున్న కొంతమంది వ్యక్తులు రూ. 50 వేల నుండి 70 వేలు అద్దె వసూలు చేస్తూ బోర్డుకు మాత్రం రూ.250 మాత్రమే చెల్లిస్తున్నారని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సంఘాలు పేర్కొంటున్నాయి. ఒక్కో షాపుకు అడ్వాన్సుగా రూ. 50 లక్షల వరకూ తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఒక వ్యక్తి ఏకంగా 65 షాపులను తన అధీనంలో పెట్టుకుని అద్దెకిచ్చినట్లు తెలిసింది. మార్కెట్ రేటు ప్రకారం అద్దె వసూలు చేయడంలో వక్ఫ్ బోర్డు విఫలమవుతోందని అంటున్నారు. వక్ఫ్‌బోర్డు నేరుగా టెనెంట్ ఒప్పందం కుదుర్చుకుని అద్దె వసూలు చేసుకున్నట్లయితే బోర్డుకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ ఆ దిశగా కార్యాచరణ లేదని పేర్కొంటున్నారు. ఈ విషయంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సంస్థల ప్రతినిధులు గతంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందన లేదని పేర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో పంజె షహీద్ దర్గాకు చెందిన 40 దుకాణాల అద్దెను స్థానిక నేతలు వసూలు చేసుకుంటున్నారు. వక్ఫ్‌బోర్డుకు ఒక్క పైసా ఆదాయం రావడం లేదు.నెలకు పది వేల అద్దెను లెక్కించినా మొత్తం నాలుగు లక్షల మేర ప్రతీ నెలా బోర్డు ఆదాయాన్ని కోల్పోతోంది. కామారెడ్డి పట్టణంలో వక్ఫ్‌బోర్డుకు చెందిన రహెమానియా వక్ఫ్ కాంప్లెక్స్‌లో ఉన్న 66 దుకాణాల పరిస్థితీ అంతే. నిజామాబాద్‌లోని స్టేషన్ బజార్ ప్రాంతంలో వక్ఫ్‌బోర్డుకు చెందిన 42 దుకాణాల అద్దె కూడా ఆక్రమణ దారులు ఒక్కో షాపుకు రోజుకు రూ.500 చొప్పున వసూలు చేస్తూన్నారు. బోర్డుకు ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇల్లెందులో ముసాఫిర్ ఖానాకు చెందిన 13 దుకాణాలు, గజ్వేల్‌లోని దర్గా హజరత్ గ్యారహ్ షహీద్‌కు చెందిన 20 షాపుల పరిస్థితీ కూడా అదే తీరులో ఉంది.